శుక్రవారం 30 అక్టోబర్ 2020
Wanaparthy - Aug 08, 2020 , 03:19:34

రైత‌న్న జ‌ర‌పైలం

రైత‌న్న జ‌ర‌పైలం

 • n ప్రకృతి వైపరీత్యాలు, క్రిమికీటకాలు, విద్యుత్‌తో పొంచి ఉన్న ప్రమాదం
 • n వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తప్పనిసరి
 • n రసాయన మందు పిచికారీలో అప్రమత్తంగా ఉండాలి

వనపర్తి : ఈ ఏడాది వానకాలం ప్రారంభం నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో జిల్లాలోని రైతులు వానకాలం పంటల సాగుపై దృష్టి సారించారు. పొలం పనుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు బిజీగా ఉన్నారు. పనుల్లో నిమగ్నమైన రైతులకు, వ్యవసాయ కూలీలకు అనుకోకుండా సంభవించే ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, క్రిమికీటకాలు, పంట పొలాల్లో ఉండే విద్యుత్‌ మరమ్మతు పనులు, మందుల పిచికారీ పనులతో ఒక్కోసారి విద్యుత్‌ ప్రమాదాలకు గురవుతుంటారు. నిత్యం వ్యవసాయ పొలాల్లో ఉంటూ పంటల దిగుబడి పెంచుకోవడం, పొంచి ఉన్న ప్రమాదాలను అధిగమించడం వంటివి ప్రస్తుత పరీక్ష కాలం. ప్రకృతితో ముడిపడిన ఈ సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం..

విష పురుగులతో..

వానకాలంలో పాములు, విషపురుగులు, క్రిమికీటకాల సంచారం ఎక్కువగా ఉంటుంది. పంటపొలాల్లోని గట్ల వెంబడి, ఎలుకలు, చిన్న చిన్న కీటకాలు పెట్టిన బొరియాల్లో పాములు, విష కీటకాలు, పురుగులు చేరి పనుల్లో నిమగ్నమైన రైతులు, వ్యవసాయ కూలీలకు ప్రమాదాలను గురి చేస్తుంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • [ పొలాల గట్లపై ఎప్పడూ గడ్డి పెరగకుండా చూసుకోవాలి. 
 • [ కలుపు మొక్కలు, గట్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 
 • [ బోర్లు, మోటార్ల వద్ద గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా ఉంచుకోవాలి.

పిడుగు పాటుతో.. 

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువడం సర్వసాధారణం. ఈ సమయంలో వర్షంలో తడువకుండా ఉండేందుకు రైతులు చెట్ల కిందకు వెళ్లి తలదాచుకుంటారు. ఇలాంటి సమయంలో పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • [ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల కిందకు వెళ్లకూడదు. 
 • [ విద్యుత్‌ ప్రసరించే వస్తువులు, కరెంట్‌ తీగలకు దూరంగా ఉండాలి. 
 • [ వర్షంలో తడువకుండా ఉండేందుకు ప్లాస్టిక్‌ దుస్తులు లేదా రేయిన్‌కోట్‌లను ధరించి విద్యుత్‌ తీగలకు దూరంగా పొలాల గట్లపై ఉండాలి.

విద్యుత్‌ విపత్తులతో .. 

వ్యవసాయ పొలాల్లో విద్యుత్‌ మోటారులో వర్షపు నీరు చేరి సమస్యలు వస్తుంటాయి. సరిచేసేందుకు రైతులు జాగ్రత్తలు పాటించకుండా ముట్టుకోవడం వల్ల విద్యుత్‌ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • [ మోటారు బోర్డులు, స్టార్టర్లు వర్షానికి తడువకుండా ప్లాస్టిక్‌ డబ్బాలు అమర్చుకోవాలి. 
 • [ ఆన్‌, ఆఫ్‌ చేసే సమయంలో చేతులు తడిగా లేకుండా చూసుకోవాలి.
 • [ చేతులకు గ్లౌజులు వాడటం వల్ల ప్రమాదబారిన పడకుండా ఉండవచ్చు. 
 • [ రైతులు ఎప్పుడూ వెంట టెస్టర్‌, కాళ్లకు పాదరక్షలు ఉంచుకుంటే మంచిది.

మందుల పిచికారీ సమయంలో ..

పటం పొలాల్లో మందు చల్లే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తరుచూ ప్రమాదాల బారిన పడుతుంటారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు పిచికారీ చేసేటప్పుడు అజాగ్రత్త వల్ల రైతులు, కూలీలు అస్వస్థతకు గురై ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదాలు ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • [ పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు రైతులు, కూలీలు గ్లౌజ్‌లు, కాళ్లకు రబ్బరు బూట్లు, ముక్కుకు గుడ్డలు ధరించాలి. 
 • [ పిచికారీ మందులను గ్లౌజ్‌లు వేసుకున్న చేతితో లేదా కర్ర సహాయంతో కలుపుకోవాలి.
 • [ పురుగు మందులు, ఎరువుల పిచికారీ, చల్లడం వంటి పనులు పూర్తైన వెంటనే చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
 • [ ఇంటికి వెళ్లగానే స్నానం చేసిన తర్వాతనే భోజనం చేయాలి.
 • [ పురుగు, ఎరువుల డబ్బాలను సర్పు నీటితో శుభ్రం చేసుకోవాలి.