గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Aug 08, 2020 , 03:19:41

టెస్టులు వేగ‌వంతం

టెస్టులు వేగ‌వంతం

  • v  సర్కారు దవాఖానల్లో ర్యాపిడ్‌   యాంటీజెన్‌ టెస్టులు
  • v  వేగంగా వైరస్‌ నిర్ధారణ
  • v  వనపర్తి జిల్లాకు 1,575  యాంటీజెన్‌ టెస్టు కిట్లు 
  • v  30 రోజుల్లో 961 టెస్టులు
  • v  పాజిటివ్‌ 185, నెగిటివ్‌ 760,  రిపోర్టులు రానివి..16

ప్రస్తుతం కంటికి కనిపించని శత్రువుతో మానవాళి పోరాడుతున్నది.. కరోనా చాపకింద నీరులా క్రమంగా పెరుగుతూ పంజా విసురుతున్నది.. దీంతో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కిట్లను అన్ని జిల్లా దవాఖానలతోపాటు పీహెచ్‌సీ కేంద్రాలకు పంపిణీ చేశారు. దీంతో కరోనా అనుమనితులు టెస్టులు చేయించుకునేందుకు ప్రభుత్వ దవాఖానలకు క్యూ కడుతున్నారు. వైరస్‌ అనుమానితులతోపాటు గర్భిణులకు, హైరిస్క్‌ రోగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ వైద్యులు టెస్టులు చేస్తున్నారు.              

    - వనపర్తి/నమస్తే తెలంగాణ


కరోనా టెస్టులను అధికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని సర్కారు దవాఖానల్లో ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. అత్యంత వేగంగా వైరస్‌ నిర్థారణ కావడంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు పరుస్తున్నది. వనపర్తి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  వారీగా 1,575 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష కిట్‌లను 30 రోజుల్లో రెండు విడుతల వారీగా పంపిణీ చేశారు. కరోనా అనుమానితులతో పాటు  గర్భిణులకు, హైరిస్క్‌ వ్యాధిగ్రస్తులకు అధిక ప్రాధాన్యతతో ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 961 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించగా వీటిలో 185 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 760 మందికి నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. ఇంకా 16 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని అధికారులు తెలిపారు.   

మూడు రకాలుగా కరోనా టెస్టులు 

మూడు రకాలు వైద్యులు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. అందులో మొదటిది ఆర్టీపీసీఆర్‌ టెస్టు, రెండవది ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌ పరీక్ష, మూడో టెస్టు ట్రూనాట్‌గా టెస్టుల రకాలను విభజించారు.

1. ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష 

కరోనా సోకినప్పటి నుంచి ఎక్కువగా ఆర్టీపీసీఆర్‌ టెస్టు నిర్వహిస్తున్నారు. ఈ టెస్ట్‌ వైరస్‌ ఉనికిని నేరుగా గుర్తించి ఆర్‌ఎన్‌ఏను కనుగొనవచ్చు. వైరస్‌ను గుర్తించే ముందు రివర్స్‌ ట్రాన్సస్కిప్షన్‌ ప్రక్రియ ద్వారా ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌కి మార్చడం ద్వారా కొనసాగుతుంది. ముక్కులోంచి గొంతుభాగంలోని స్రవాలను స్వాబ్‌ ద్వారా సేకరిస్తారు. వైరస్‌ను గుర్తించేందుకు ఆర్టీ పీసీఆర్‌ యంత్రంతో ఫలితాలు తెలియజేస్తారు. మూడు గంటల్లో ఫలితాలు వెల్లడించవచ్చు.

2. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌

ఈ టెస్టు ద్వారా శరీరం ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలను కాకుండా వైరస్‌ను గుర్తించడానికి వినియోగిస్తారు. కంటైన్‌మెంట్‌ జోన్లు, హెల్త్‌కేర్‌లో పనిచేసే వారికి ఉపయోగించడానికి దీనిని ఐసీఎంఆర్‌ ఆమోదించింది. వైరస్‌ లేదా వైరస్‌ లోడ్‌మీద ఇది ఆధాపడి ఉంటుంది. రోగనిరోధక ప్రతి స్పందనను ప్రేరేపించే శరీరంలోని ఏదైనా యాంటీజెన్‌ను ఈ పరీక్ష ద్వారా సూచిస్తుంది. ముక్కులోని నమూనాలను సేకరించి యాంటీజెన్‌ల కోసం పరీక్షిస్తారు. ఇవి సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ద్వారా కనిపిస్తాయి. ఇది ల్యాబ్‌ బయట నిర్వహించే పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ పరీక్ష కావడంతో త్వరగా వైరస్‌ను నిర్థారించవచ్చు. గరిష్టంగా 30 నిమిషాలలోపు ఈ ప్రక్రియ ద్వారా వైరస్‌ను నిర్థారించవచ్చు. దక్షిణ కొరియా కంపెనీ ఎస్‌డీ బయోసెన్సార్‌ అభివృద్ధి చేసిన యాంటీజెన్‌ డిటెక్షన్‌ కిట్‌ల వాడకాన్ని ఐసీఎంఆర్‌ అనుమతించింది. 


3. ట్రూనాట్‌ పరీక్ష

క్షయ, హెచ్‌ఐవీ గుర్తించడానికి సాధారణంగా వినియోగించే ట్రూనాట్‌ పరీక్ష ఆర్టీ పీసీఆర్‌ మాదిరాగానే పనిచేస్తున్నది. ఈ టెస్టుల ద్వారా వేగవంతంగా ఫలితాలు వెల్లడించవచ్చు. కొవిడ్‌-19 కోసం స్క్రీనింగ్‌, నిర్ధారణకు గోవాకు చెందిన ఓ సంస్థ తయారు చేసిన ట్రూనాట్‌ను ఐసీఎంఆర్‌ ఇటీవల ఆమోదించింది. ట్రూనాట్‌ యంత్రం చిప్‌ ఆధారితంగా బ్యాటరీపై  పనిచేస్తుంది. ఈ టెస్టులో రోగి ముక్కు, నోరు నుంచి స్వాబ్‌ సేకరించి వైరస్‌ను గుర్తిస్తారు. వైరస్‌ ఆర్‌ఎన్‌లో కనిపించే ఆర్టీఆర్పీ ఎంజైమ్‌ను గుర్తించడానికి ఈ యంత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ట్రూనాట్‌ పరీక్ష ద్వారా 60నిమిషాల్లో ఫలితాలను అందించవచ్చు.   

ర్యాపిడ్‌ ద్వారా వేగంగా నిర్ధారణ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూడు కరోనా పరీక్షల్లో ర్యాపిడ్‌ టెస్టుల ద్వారా వైరస్‌ను వేగంగా గుర్తించవచ్చు. ఈ పరీక్షతో 30 నిమిషాల్లో వైరస్‌ను గుర్తిస్తుండటంతో ప్రభుత్వం ఈ ప్రక్రియను జిల్లాల్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వినియోగిస్తున్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులో పాజిటివ్‌ నిర్ధారణకు ముందుగా అనుమానితుడి ముక్కు లేదా గొంతులోంచి పుల్లలాంటి వైద్య పరికరంతో స్వాబ్‌ నమూనాలను సేకరిస్తారు. వీటిని అక్కడే కెమికల్‌ కలిగిన ద్రావణంలో 10 నిమిషాలపాటు ముంచి ఉంచుతారు. పుల్లపై రెండు నిటారు గీతల గుర్తులు వస్తే కరోనా పాజిటివ్‌గా, ఒకే గీత ఉన్నట్లుగా వస్తే నెగిటివ్‌గా పరిగణిస్తారు. ఇలాంటి పరీక్షల ద్వారా త్వరగా ఫలితాలు వస్తుండడంతో పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు అవకాశం ఉన్నది. 

ర్యాపిడ్‌ కిట్ల వివరాలు 

వనపర్తి జిల్లాకు ప్రభుత్వం రెండు విడుతల ద్వారా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్‌లను అందించింది. రెండు విడుతల్లో కలిపి అన్ని దవాఖానలకు మొత్తం  1,575 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు కిట్‌లను అందించారు. వీటిలో జిల్లా దవాఖాన, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌తోపాటు 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మొదటి విడుతలో ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 25 చొప్పున, జిల్లా దవాఖాన, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు కలిపి 500, సీహెచ్‌సీ రేవల్లికు 200, సీహెచ్‌సీ ఆత్మకూర్‌కు 50, రెండో విడుతలో ఒక్కో పీహెచ్‌సీకి 

100 చొప్పున, జిల్లా దవాఖాన, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు కలిపి 500, 

సీహెచ్‌సీ రేవల్లికు 100, సీహెచ్‌సీ ఆత్మకూర్‌కు 100 కిట్‌లు పంపిణీ చేసినట్లు వనపర్తి జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

6వ తేదీ వరకు వనపర్తి జిల్లాలో చేసిన టెస్టులు

దవాఖాన టెస్టులు పాజిటివ్‌ నెగిటివ్‌ 

జిల్లా దవాఖాన            410 68 312

రేవల్లి  సీహెచ్‌సీ 33 6 28

ఆత్మకూర్‌ సీహెచ్‌సీ 78 14 44

కడుకుంట్ల  పీహెచ్‌సీ 104 25 82

అప్పరాల  పీహెచ్‌సీ 26 2 21

గోపాల్‌పేట  పీహెచ్‌సీ 33 5 22

కొత్తకోట  పీహెచ్‌సీ 18 1 17

కమలోద్దీన్‌పూర్‌  పీహెచ్‌సీ 19 5 14

ఖిల్లాఘణపూర్‌  పీహెచ్‌సీ 19 0 18

మదనాపురం  పీహెచ్‌సీ 17 0

తిప్పడంపల్లి  పీహెచ్‌సీ 14 5 12

పీపీయూ వనపర్తి 38 6 28

పాన్‌గల్‌  పీహెచ్‌సీ 44 5 42

పెద్దమందడి   పీహెచ్‌సీ 34 18 22

పెబ్బేరు  పీహెచ్‌సీ 52 13 39

వీపనగండ్ల  పీహెచ్‌సీ 60 16 51

961 185 760

రిపోర్టులు రానివి 16

భయపడాల్సిన అవసరం లేదు


ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్‌లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, జిల్లా దవాఖానల్లో టెస్టులు నిర్వహిస్తున్నాం. కిట్ల ద్వారా వచ్చిన ఫలితాలలో పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే చికిత్స ప్రారంభిస్తున్నాం. లక్షణాలతో ఇబ్బంది పడుతున్నవారు నేరుగా దవాఖానకు వెళ్లి టెస్టులను చేయించుకోవాలి. వైరస్‌ సోకిన రోగులు భయపడాల్సిన అవసరం లేదు. చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. వైరస్‌ లక్షణాలున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోండి.

- శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో, వనపర్తి జిల్లా