సోమవారం 28 సెప్టెంబర్ 2020
Wanaparthy - Aug 08, 2020 , 02:30:24

వ‌న‌ప‌ర్తిలో సమీకృతమార్కెట్‌

వ‌న‌ప‌ర్తిలో  సమీకృతమార్కెట్‌

  • g    ఆధునిక సౌకర్యాలు, హంగులతో భవనం
  • g    సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట స్థాయిలో నిర్మాణం
  • g    అన్ని జిల్లా కేంద్రాల్లో రూపకల్పనకు సీఎం ఆలోచన
  • g     ప్రజలకు అవసరమయ్యే నిత్యావసరాలన్నీ ఒకేచోట
  • g    వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
  • g     వనపర్తి మార్కెట్‌ నిర్మాణానికి డిజైన్‌ ఖరారు

వనపర్తిలో ఆధునిక హంగులతో సమీకృత మార్కెట్‌ను నిర్మించ నున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న మార్కెట్‌ స్థలాన్ని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా,  ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేటలో మాదిరిగా నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 

- వనపర్తి రూరల్‌


  వనపర్తి రూరల్‌ : వనపర్తి జిల్లా కేంద్రంలో త్వరలోనే అన్ని హంగులు, ఆధునిక సౌకర్యాలతో సమీకృత మార్కెట్‌ను నిర్మించనున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేయనున్న  ఆధునిక సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి స్థలాన్ని జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ శ్రీవాత్సవ, ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖాధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. కూరగాయలతోపాటు మాం సం, గుడ్లు, చేపలు, అన్ని రకాల దినుసులు, ఆహార పదార్థాలు లభించేలా నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత మార్కెట్లను ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూపకల్పన చేస్తున్నారన్నారు. ఇప్పటికే సిరిసిల్ల, గజ్వేల్‌, సిద్దిపేట ప్రాంతాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. రెండు ఎకరాలలో ఏర్పాటు చేయనున్న మార్కెట్‌ ప్రాంగణంలో మార్కెటింగ్‌ శాఖ ద్వారా నిర్మాణాలు చేపడుతామని వెల్లడించారు. వెజ్‌, నాన్‌వెజ్‌, ఆహార ధాన్యాలతోపాటు ఒక ఫార్మసీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రతిరోజు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడికొచ్చే వారితోపాటు వెంట వచ్చే వారి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది వరకే స్థలాన్ని ఎంపిక చేశామని, కలెక్టర్‌తోపాటు అధికారులతో కలిసి అందుకు సంబంధించిన మ్యాపులను  పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఒకటి, రెండ్రోజుల్లో అంచనాలు రూపొందించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం  మండలంలోని చిట్యాల గ్రామ శివారులో నిర్మితమవుతున్న మార్కెట్‌ యార్డు పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా.. నిరాటంకంగా చేపట్టి డిసెంబర్‌ చివరికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. వచ్చే యాసంగిలో పండిన వేరుశనగ పంటను రైతులు ఇక్కడే విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌ యార్డుకు వెళ్లే రోడ్డు డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్కెటింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ రవికుమార్‌, జేడీ శ్రీనివాసులు, ఈఈ రాధాకృష్ణమూర్తి, ఉమ్మడి జిల్లా డీఈఈ నాగేశ్వరరావు, మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, గొర్రెలు, కాపరుల సంఘం చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, వనపర్తి జిల్లా మార్కెటింగ్‌ అధికారి స్వర్ణసింగ్‌, ఏఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
logo