గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Aug 06, 2020 , 02:37:15

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ఆత్మకూరు : రోజురోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఎస్పీ అపూర్వరావు పేర్కొన్నారు. బుధవారం అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండడానికి ఆమె ఆత్మకూరులో పర్యటించారు. అనంతరం ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి సీఐ, ఎస్సైలతో ప్రత్యేక సమావేశమయ్యారు. ఠాణా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పురోగతి, పెండింగ్‌ కేసులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కరోనాపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లోనూ పాజిటివ్‌  కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారికి శానిటైజేషన్‌, హ్యాండ్‌వాష్‌, నీటి వసతి కల్పించాలని చెప్పారు. నిరంతరం భౌతికదూరం పాటిస్తూ ప్రతి 20 నిమిషాలకు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ప్రజల మధ్య మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లినప్పుడు శానిటైజేషన్‌, స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లాలన్నారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఫిర్యాదుదారుడు ఒక్కరికే  సేష్టన్‌లోకి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు, యువతులకు ఎలాంటి సమయాల్లోనైనా పోలీసులు అండగా ఉంటారన్నారు. డయల్‌ 100తో పోలీసులు పది నిమిషాల్లో అందుబాటులో ఉంటారన్నారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, ఎస్సై  ముత్తయ్య పాల్గొన్నారు. 

నాణ్యత పాటించి పనులు చేయాలి

మదనాపురం : మండల కేంద్రంలోని నైజాం కాలంనాటి పురాతన పోలీస్‌ అవుట్‌ పోస్టును జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై తిరుపాజీ పునర్నిర్మాణం చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా ఎస్పీ అపూర్వరావు పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఎస్సైతో మాట్లాడుతూ నిర్మాణానికి ఉపయోగించే వస్తుసామగ్రి నాణ్యత కలిగి ఉండాలని సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భవనాలు నిర్మిస్తున్నామని,  అధికారులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో హరితహారం కార్యక్రమంలో భాగంగా కొబ్బరి మొక్కలు నాటి నీరు పోశారు. పోలీస్‌ స్టేషన్‌కు సొంత భవనం ఏర్పాటు చేయడమే కాకుండా, నైజాం కాలంనాటి పురాతన భవనాన్ని నూతన హంగులతో పనులు ప్రారంభించిన ఎస్పీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సీతయ్య, ఎస్సై తిరుపాజీ, సిబ్బంది, టీఆర్‌ఎస్‌ టౌన్‌ ప్రెసిడెంట్‌ సత్యంయాదవ్‌, సగర సంఘం నాయకులు రంగన్న పాల్గొన్నారు.