బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Aug 05, 2020 , 02:17:52

అక్టోబ‌ర్ లోగా రైతువేదిక భ‌వ‌నాలు పూర్తి

అక్టోబ‌ర్ లోగా రైతువేదిక భ‌వ‌నాలు పూర్తి

  రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎంకేసీఆర్‌ వారి అభ్యున్నతికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నారు. వనపర్తి జిల్లాకు మంజూరైన  71 భవన నిర్మాణాలను అక్టోబర్‌ నాటికిపూర్తి చేసేలా అధికారులు చర్యలుచేపట్టారు.మూడు గ్రామాల్లో దాతలు భవన నిర్మాణాలకుముందుకొచ్చారు. నిత్యం పనులను పర్యవేక్షిస్తుండటంతో పలు చోట్ల పనులు చకచకా కొనసాగుతున్నాయి.  ఈ భవనాలు పూర్తయితే కర్షకులు ఒకేచోట సమావేశమై సాగు పద్ధతులు తెలుసుకు నేందుకు ఎంతో ఉపయోగపడనున్నాయి. 

రైతుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.. అన్నదాతలందరూ ఒకచోట చేరి సాగు విధివిధానాలను చర్చించుకునేందుకు వీలుగా వీటి నిర్మాణాలు చేపట్టింది.. క్లస్టర్‌కు ఒకటి చొప్పున వనపర్తి జిల్లాలో 71 రైతు వేదికలను ఏర్పాటు చేస్తున్నది.. అక్టోబర్‌ నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం నిత్యం పర్యవేక్షిస్తున్నది.. నిర్మాణ పనులు చకచకా కొనసాగుతున్నాయి.. మూడు చోట్ల నిర్మించేందుకు దాతలు ముందుకు వచ్చారు.. మిగిలిన 68 భవనాలకు ఒక్కో దానికి రూ.12లక్షల చొప్పున రూ.81.60కోట్లను కేటాయించింది.. ఆధునిక హంగులతో సకల సదుపాయాలు కల్పిస్తున్నారు.. భవన పనులు పూర్తి అయితే ఏఈవోలు రైతులకు శిక్షణ ఇచ్చేందుకు చెట్లకింద, పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసుకునే తిప్పలు తప్పనున్నాయి..

రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చే స్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రై తుల కోసం అమలుపరిచిన ప్రతీ పథకం విజయవంతం కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రైతులకు వ్యవసాయంలో మెళకువలను నేర్పేందుకు, అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రైతువేదికలను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకోసం ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థ లాన్ని కేటాయించి నిర్మాణాలను చేపట్టింది. 

వనపర్తిలో 71 రైతువేదికలు

రైతువేదికల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలకు, స్థల కేటాయిపును రెవెన్యూ శాఖకు, పనుల పర్యవేక్షణను వ్యవసాయ శాఖ అధికారులకు, స్థా నిక ప్రజాప్రతినిధులకు అప్పగించారు. జిల్లాలో నేల స్వభావాన్ని బట్టి వ్యవసాయ శాఖ ప్రతి ఐదు వేల ఎకరాలను ఒక క్లస్టర్‌గా విభజించింది. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను నియమించి రైతులకు ని త్యం అందుబాటులో ఉండడంతోపాటు వ్యవసాయంలో మెళకువలు నేర్పించేలా సేవలు అందించనున్నారు. క్లస్టర్ల ఆధారంగా జిల్లాలో మొత్తం 71 రైతు వేదికలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. వీటిలో పెద్దమందడిలో 1, పాన్‌గల్‌లో 1, నాగవరంలో 1 మొత్తం మూడు భవనాలను నిర్మించేందుకు దాతలు ముందుకు వ చ్చారు. మిగిలిన 68 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించనున్నది.

సకల సదుపాయాలతో..

గతంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల కు శిక్షణ తరగతులు అం దించేందుకు ఇబ్బందు లు ఎదుర్కొనేవారు. సరై న వేదిక లేకపోవడంతో చెట్ల కిందనో, పంచాయ తీ కార్యాలయం లేదా ప్ర జాప్రతినిధుల ఇంటి ఆవరణలోనో శిక్షణ ఇచ్చేవా రు. రైతువేదికలతో ఈ ఇ బ్బందులన్నీ తీరనున్నా యి. రైతులందరికీ అం దుబాటులో ఉండే ప్రదేశాల్లో భవనాలను నిర్మించనున్నారు. ఇందుకోసం గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు భవనంలో ప్రత్యేకంగా హాల్‌ను నిర్మిస్తున్నారు. వ్యవసాయాధికారులు నిత్యం అందుబాటులో ఉండేందుకు వారి కోసం ప్రత్యేకంగా మరో గదిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఎరువులు, ఇతర సామగ్రి నిల్వ చేసేందుకు గోదాంలను నిర్మిస్తున్నారు. 

రూ.81.60 కోట్ల కేటాయింపు..

రైతువేదికల నిర్మాణాల కోసం ప్రభుత్వం వ్య వసాయ శాఖ తరఫున బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతువేదిక భవనానికి రూ.12 లక్షల చొప్పున మొత్తం 68 రైతువేదిక భవనాలకు రూ.81.60 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా అన్ని గ్రామాల్లో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు రైతువేదిక భవనాల నిర్మాణాలను చేపట్టారు. జిల్లాలో ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన అన్ని రైతువేదిక భవన పనులు చకచకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బేస్‌మెంట్‌ పూర్తి చేసుకొని పిల్లర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్టోబర్‌ నాటికి రైతువేదిక భవనాలను ఎట్టిపరిస్థితుల్లో పూర్తిచేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా అధికారులను ఆదేశించారు. 

మండలాల వారీగా..

వనపర్తి జిల్లాలో పంచాయతీరాజ్‌ ఇంజినీరిం గ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల తరఫున రైతువేదిక భవనాలను నిర్మిస్తున్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరిం గ్‌ శాఖ తరఫున వనపర్తిలో 7, పెబ్బేరులో 6, శ్రీ రంగాపూర్‌లో 3, గోపాల్‌పేటలో 6, పెద్దమందడిలో 8, కొత్తకోటలో 5, ఆత్మకూరులో 3, పాన్‌గల్‌లో 5, వీపనగండ్లలో 6, చిన్నంబావిలో 7 ని ర్మిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో రేవల్లిలో 4, ఖిల్లాఘణపురంలో 7, మదనాపురంలో 3, అమరచింతలో 3 రైతువేదికలు నిర్మాణమవుతున్నాయి. 

పనులు వేగంగా జరుగుతున్నాయి..

రైతువేదిక నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భవన నిర్మాణాలు చేపడుతున్నాం. అక్టోబర్‌ నాటికి రైతువేదికలు పూర్తి చేయాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశించారు. ఈ మేరకు పనులు జరిగేలా ప్రణాళికలు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం శంకుస్థాపన పూర్తిచేసుకున్న భవన పనులు బేస్‌మెంట్‌ పూర్తి చేసుకొని పిల్లర్లు నిర్మించే దశలో ఉన్నాయి. రైతులకు అన్ని విధాలా సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నాం.  శివకుమార్‌, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఎస్‌ఈ