శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Aug 04, 2020 , 09:09:23

రాఖీలు కట్టి అనుబంధాన్ని చాటుకున్న అక్కాచెల్లెళ్లు

 రాఖీలు కట్టి అనుబంధాన్ని చాటుకున్న అక్కాచెల్లెళ్లు

  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  నిరాడంబరంగా పండుగ
  • l ప్రజాప్రతినిధులకు రాఖీ కట్టిన సోదరీమణులు
  • l పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పూజలు

రక్షాబంధన్‌ నిరాడంబరంగా జరిగింది..అక్కాచెల్లెళ్లు సోదరులకు రాఖీ కట్టి తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  కల్వకుర్తితో ఓ చెల్లి అన్నకు హెల్మెట్‌, మాస్క్‌ బహుమతిగా ఇవ్వగా, మహబూబ్‌నగర్‌లో మాస్కునే రాఖీగా ముఖానికి కట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అచ్చంపేటలో శునకాన్ని తమ కుటుంబంలో ఒకరిగా భావించి రాఖీ కట్టింది ఓ యువతి. బైరాపూర్‌లో చెట్లకు రాఖీ కట్టి మొక్కలపై తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు చిన్నారులు.

- నెట్‌వర్క్‌, నమస్తే తెలంగాణ

జిల్లా కేంద్రంతోపాటు పాన్‌గల్‌, ఆత్మకూరు, అమరచింత, గోపాల్‌పేట, పెద్దమందడి, వీపనగండ్ల, మదనాపురం, ఖిల్లాఘణపురం, కొత్తకోట మండలాల్లోని వివిధ గ్రామాల్లో రక్షాబంధన్‌ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. నాకు నువ్వు రక్ష.. నేను నీకు రక్ష, దేశానికి మనమందరం రక్ష అనే రీతిలో తోబుట్టువులు రాఖీలు కట్టారు. ఈ శుభవేళ తోబుట్టువుల ఇండ్లల్లో ఆనందాలు వెల్లివిరియాలని రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అక్కచెల్లెలు దూర ప్రాంతాల నుంచి తల్లిగారి ఊరికి చేరుకోవడంతో గ్రామాలన్నీ సందడిగా మారాయి. సోదరులపై ఉన్న ప్రేమను రాఖీ రూపంలో ప్రతి ఏడాది రాఖీలు కట్టి సంతోషంగా రక్షాబంధన్‌ను జరుపుకొంటారు. రాఖీ పండుగ సందర్భంగా సోమవారం గోపాల్‌పేట మండల జెడ్పీటీసీ భార్గవి కోటేశ్వర్‌రెడ్డి వనపర్తి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌కు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసగృహంలో రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మకూరులో రక్షాబంధన్‌ శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆత్మకూరులోని సాయిబాబా దేవాలయంలో భక్తులు సాయిబాబాకు రాఖీలు కట్టారు. గోపాల్‌పేట మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లోని ప్రజలు రాఖీ పండుగను ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, సింగిల్‌విండో చైర్మన్‌ రఘుయాదవ్‌, వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ తిరుపతి యాదవ్‌ మండల ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దమందడి మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో అక్క తమ్ముళ్లకు,  చెల్లెలు అన్నలకు రాఖీలు కట్టి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మదనాపురం మండల కేంద్రంతోపాటు గోవిందహళ్లి, శంకరమ్మపేట, దంతనూరు, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకొల్లు, నెలివిడి, నర్సింగాపురం, కొన్నూరు, కొత్తపల్లి, దుప్పల్లి, గోపన్‌పేట, కర్వెన గ్రామాలతో పాటు ఆయా తండాల్లోని ప్రతి ఇంటిలో రాఖీ పండుగా సందడి నెలకొన్నది. ఖిల్లాఘణపురం మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో మరికొందరూ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్‌ల ద్వారా రక్షాబంధన్‌ వేడుకలను జరుపుకున్నారు.

చేయూత ఆశ్రమంలో..

వనపర్తి రూరల్‌ : మండలంలోని చిట్యాల గ్రామశివారులో గల చేయూత ఆశ్రమంలోని చిన్నారులు సోమవారం రాఖీ పం డుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని బాలురకు బాలికలు రాఖీలను కట్టి అనుబంధానికి ప్రతీకగా ఆశ్రమంలో మనందరం కలిసి మెలసి ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.