మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Wanaparthy - Aug 03, 2020 , 03:47:11

లాక్‌డౌన్‌ పేరుతో అధిక ధరలకు నిత్యావసర సరుకులు

లాక్‌డౌన్‌ పేరుతో అధిక ధరలకు నిత్యావసర సరుకులు

  • కరోనా వేళ కక్కుర్తి పడుతున్న వైనం
  • కల్వకుర్తిలో కొందరు వ్యాపారుల అత్యాశ

కల్వకుర్తి: కరోనా తీవ్రతను అరికట్టేందుకు కల్వకుర్తి కిరాణా  అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం కొందరు వ్యాపారులకు కాసుల పంట పండుతుంది.కిరాణా అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛందగా లాక్‌డౌన్‌ పాటిస్తుంటే.. కొందరు వ్యాపారులు మాత్రం ఇదే అదునుగా నిత్యావసర సరుకుల ధరలను అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. కిరాణా దుకాణాలు దాదాపుగా మూసి ఉండటంతో కొందరు వ్యాపారులు దొంగచాటుగా తమ దుకాణాలు తెరిచి కొనుగోలుదారులను దోచుకుంటున్నారు. కల్వకుర్తి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో కల్వకుర్తి కిరాణా అసోసియేషన్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి అరికట్టేందుకు తమవంతు పాత్ర పోషించేందుకు 10 రోజులపాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ చేయాలని కిరాణా అసోసియేషన్‌ తీర్మానం చేసింది. 10రోజుల పాటు కల్వకుర్తి పట్టణంలో ఏ ఒక్క కిరాణా దుకాణం కూడా తెరవొద్దని, తీర్మానాన్ని ఉల్లంఘించి ఎవరైన దుకాణం తెరిస్తే రూ.10వేలు జరిమానా  విధిస్తామని తీర్మానించారు. అందులో భాగంగా ఈ నెల 29 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు కిరాణా దుకాణాలు మూసి ఉంచాలని నిర్ణయించి, సదరు నిర్ణయాన్ని అమలుపర్చారు.

నీచానికి దిగిన కొందరు వ్యాపారులు

కల్వకుర్తి పట్టణంలో కొందరు వ్యాపారులు కిరాణా అసోసియేషన్‌ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ తమ వక్ర దందాకు తెరలేపారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 10రోజుల పాటు కిరాణా దుకాణాలు బంద్‌ చేయడాన్ని సదరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. దుకాణాలను దొంగచాటుగా తెరిచి నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తమ దుకాణాల్లో బంధువులను ఉంచి, దుకాణాల బయట వీరు ఉంటూ సరుకులను విక్రయిస్తున్నారు. ప్రతి వస్తువు ధరను అమాంతం పెంచేశారు. ఇదేమిటంటే ఇష్టం ఉంటే కొను.. లేదా వెళ్లిపో అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. 10రోజులపాటు బంద్‌ ఉంటుంది.. రేపు అయితే మరింత ధర    పెరుగుతుందని బయపెడుతున్నారు. ఉదాహరణకు మంచినూనే ప్యాకెట్‌ రూ.90 ఉంటే రూ.100కు, బెల్లం కిలో రూ.50 ఉంటే రూ.150కి, కందిపప్పు కిలో రూ.95 ఉంటే రూ.120, చింతపండు రూ.160 ఉంటే రూ.200, చక్కెర కిలో రూ.38 ఉంటే రూ.45, 15 కిలోల నూనే డబ్బా ఖరీదు రూ.1550 ఉంటే రూ.1650, శనిగపప్పు కిలో రూ.65 ఉంటే రూ.80, గోదుమపిండి కిలో రూ.30 ఉంటే రూ.35 కి విక్రయిస్తున్నారు. దీంతో బంద్‌ విషయం తెలియని వినియోగదారులు గత్యంతరం లేని స్థితిలో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పనిలో పనిగా ఈ సదరు దందా నిర్వహిస్తున్న వ్యాపారులు నిషేధిత గుట్కాను విపరీతంగా అమ్ముతున్నారు.

స్వచ్ఛంద లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు

వ్యాపారుల స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయినప్పటికీ.. బాధ్యత కలిగిన వారు ఎవరూ  ధ్రువీకరించపోవడంతో పట్టణవాసులు తేలిగ్గా తీసుకున్నారు. నిజంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అవుతుందా.?, ప్రభుత్వం లాక్‌డౌన్‌ చేపట్టినప్పుడు కిరాణా దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు కదా అనే భావనతో ముందుగానే కిరాణా వస్తువులను కొనుగోలు చేయలేకపోయారు. తీరా చూస్తే ఈనెల 29 నుంచి కిరాణా దుకాణాలు మూసి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. తప్పని పరిస్థితుల్లో దొంగచాటుగా విక్రయిస్తున్న వారి వద్ద నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చింది.

దొంగచాటుగా అధిక ధరలకు..

అసోసియేషన్‌ తీర్మానాన్ని తుంగలో తొక్కి నిబంధనలకు 

విరుద్ధంగా అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిరాణా అసోసియేషన్‌ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తాము తమ వ్యాపారాలను 10రోజులపాటు మూసుకుంటే.. కొందరు అక్రమార్కులు శవాలపై పేలాలు ఏరుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలు, సమాజ శ్రేయస్సుకు తాము స్వచ్ఛందంగా దుకాణాలు బంద్‌ చేసుకుంటే.. అక్రమ వ్యాపారులు మాత్రం లాభాలే ధ్యేయంగా వినియోగదారుల ఉసురు పోసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్న నేపథ్యంలో, కొందరు వ్యాపారులు ధరలు పెంచి నిత్యావసర వస్తువులను విక్రయించడం దారుణమైన విషయం. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి విక్రయిస్తున్న వారి వివరాలు తమకు ఇస్తే తగిన చర్యలు తీసుకుంటాం.

- మహేందర్‌, ఎస్సై, కల్వకుర్తిlogo