మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jul 26, 2020 , 06:59:52

వరుడికి కరోనా పాజిటివ్‌..ఆగిన పెండ్లి

వరుడికి కరోనా పాజిటివ్‌..ఆగిన పెండ్లి

వనపర్తి రూరల్‌ : వరుడికి కరోనా సోకడంతో పెండ్లి వేడుక ఆగిపోయిన సంఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. డాక్టర్‌ రాకేశ్‌రెడ్డి కథనం మేరకు.. వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన యువకుడికి పాన్‌గల్‌ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన యువతితో ఈనెల 26న వివాహం జరగాల్సి ఉంది. అయితే పెండ్లి పత్రికలు బంధువులకు పంచే క్రమంలో ఐదు రోజుల కిందట యువకుడికి జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వచ్చాయి. అనుమానంతో అతను కరోనా పరీక్షలు చేయించుకోగా.. శనివారం పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. దీంతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. విషయం తెలుసుకున్న తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, మండల వైద్యాధికారి రాకేశ్‌రెడ్డి  సదరు యువకుడికి వివరాలు సేకరించారు. ప్రస్తుతం హోంక్వారంటైన్‌లో యువకుడిని ఉంచారు. వరుడితో ప్రైమరీ కాంటాక్ట్‌ వ్యక్తుల వివరాలు సేకరించి వారికి పరీక్షలు నిర్వహించే పనిలో వైద్యాధికారులు నిమగ్నమయ్యారు.