సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Jul 26, 2020 , 06:57:12

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

వనపర్తి టౌన్‌ : జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో శనివారం భక్తులు నాగుల పంచమి వేడుకలను ఘనంగా  జరుపుకొన్నారు. మహిళలు తమ ఇండ్లను శుభ్రం చేసుకొని నాగ దేవతలకు బెల్లం ఉండలు, చక్కెరతో పరమాన్నం నైవేద్యంగా చేసుకొని సమీపంలో పుట్టలు, ఆలయాల్లో ఉన్న దేవత విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నూతన దంపతులు నూతన వస్ర్తాలు ధరించి నాగ దేవతలకు పాలు పోసి ప్రత్యేక  పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, రామాలయం, చింతల హనుమాన్‌, అయ్యప్ప స్వామి ఆలయం, వెంగల్‌రావు కాలనీ పార్కు, పాలిటెక్నిక్‌ కళాశాల పరిసర ప్రాంతాల్లో పుట్టలో భక్తులు పాలు పోశారు. అదేవిధంగా ఆలయాల వద్ద ఉన్న వేపచెట్టు, రావిచెట్టుకు పూజలు నిర్వహించారు. 

ఆత్మకూరు, అమరచింత మండలాల్లో

ఆత్మకూరు : ఆత్మకూరు, అమరచింత మండలాల్లోని అన్ని గ్రామాల్లో శనివారం నాగుల పంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది.  స్థానిక బాలబ్రహ్మేశ్వరస్వామి, స్పటిక లింగేశ్వరస్వామి దేవాలయం, కోట్ల ఆంజనేయస్వామి దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. మరికొన్ని చోట్ల నాగుల పుట్టలకు పూజలు నిర్వహించి పాలు పోశారు. 

కోటిలింగేశ్వర ఆలయంలో..

కొత్తకోట : మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తా దేవస్థానంలో శనివారం నాగుల పంచమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి శేఖర్‌, భక్తులు పాల్గొన్నారు.