ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 25, 2020 , 01:58:11

కరోనా బాధితుల కోసం

కరోనా బాధితుల కోసం

  • వనపర్తి జిల్లాకు మూడు అంబులెన్స్‌లు 
  •  జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానకు ఒకటి కేటాయింపు
  • మిగతా రెండు జిల్లాలో ఇతర ప్రదేశాలకు

వనపర్తి, నమస్తే తెలంగాణ : రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హర్షణీయమైన ప్రకటన చేశారు. కరోనా రోగులకు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టేందుకు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు నిర్ణయించారు. సొంత నిధులతో జిల్లాలో కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు మూడు అంబులెన్స్‌లు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో ఒకటి జిల్లా ఏరియా దవాఖానకు ఇప్పటికే కేటాయించగా మిగితా రెండు అంబులెన్స్‌లను జిల్లాలో ఇతర ప్రదేశాలల్లో సేవలు అందించేందుకు కేటాయించనున్నారు.

కరోనా రోగులకు సేవలు అందించేలా అంబులెన్స్‌లో అత్యవసర మందులతో పాటు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ అంబులెన్స్‌ సర్వీసులు మినీ దవాఖానలుగా వైద్య సేవలు అందించనున్నాయి. ఇందుకు కావాల్సిన వైద్య పరికరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంతో ఎందరో కరోనా వ్యాధిగ్రస్తులకు విస్తృత సేవలు అందనున్నాయి. రోగులను సకాలంలో దవాఖానకు తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఉపయోగపడనున్నాయి.