మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jul 18, 2020 , 04:27:03

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలి

పాన్‌గల్‌ : రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీ వైద్యుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని దవాజీపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో వైద్యుడు వంశీకృష్ణ గ్రామంలోని యువకుడి ఇంటిని సందర్శించి ఐసొలేషన్‌లో ఉంచారు. తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు వివరించారు. అలాగే ఆ యువకుడితో సన్నిహితులైన నలుగురు ప్రైమరీ కాంట్రాక్ట్‌లను హోంక్వారంటైన్‌ చేశామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటయ్యయాదవ్‌, ఆరోగ్య విస్తరాణాధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

బాధితుడిని గాంధీకి తరలింపు

ఆత్మకూరు : పట్టణంలోని బీసీ కాలనీలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని శుక్రవారం గాంధీ దవాఖానకు తరలించారు. మూడు రోజుల కిందట శాంపిళ్లను సేకరించిన వైద్యాధికారుల బృందానికి గురువారం ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితుడికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం తో అతడిని జిల్లా వైద్యాధికారుల సూచనల ప్రకా రం హైదరాబాద్‌ గాంధీ దవాఖానకు తరలించా రు. అతడి కుటుంబంలో ముగ్గురిని హోం క్వారంటైన్‌ చేశారు. అదేవిధంగా అమరచింత బీసీ కాలనీలో తండ్రి, కొడుకులు, ఈర్లదిన్నెలో ఓ మహిళకు పాజిటివ్‌ తేలగా వీరంతా తమ స్వగృహల్లో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. హోం క్వారంటైన్‌ ఉన్నవారికి ఐదు రోజుల తర్వాత కరోనా నిర్ధారణ పరీక్షలకు శాంపిళ్లను సేకరించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో వైద్యులు అక్షయ్‌కుమార్‌, సాయితేజ, సూపరింటెండెంట్లు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 

నాయీబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి

ఖిల్లాఘణపురం : నాయీబ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం నాయీబ్రాహ్మణ సంఘం మండలాధ్యక్షుడు ఆశన్న ఆధ్వర్యంలో తాసిల్దార్‌ వెంకటకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో హెయిర్‌ సెలున్లకు కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని కోరారు. ఒక్కొక్క నాయీబ్రాహ్మణ కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.20వేలు ఆర్థిక సాయం చేయాలని వినతిలో కోరినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా, మండల నాయకులు ఉన్నారు. 

పలు గ్రామాల్లో ఆంక్షలు

వనపర్తి రూరల్‌ : మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తించడంతో శుక్రవారం ఆయా గ్రామాల సర్పంచులు ప్రజలను ఆప్రమత్తం చేస్తూ సూచనలు చేశారు. ఈ సందర్భంగా కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామాల్లో రెండు రోజుల కిందట కడుకుంట్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో గ్రామస్తులను అప్రమత్తం చేశా రు. ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరిచి, సాయంత్రం 6 గంటలకు మూసి వేయాలని ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించాలని సూచించారు. 

ఖిల్లా సర్పంచ్‌కు సన్మానం

ఖిల్లాఘణపురం : ఖిల్లా అభివృద్ధికి, ప్రజలకు ఎల్లప్పుడు తనవంతు సహకారం అందిస్తూ సేవలు చేస్తున్న ఖిల్లాఘణపురం సర్పంచ్‌ వెంకటరమణను శుక్రవారం మండలంలోని మానాజీపేట గ్రామ యువకులు ఖిల్లా బస్టాండ్‌ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ నిరంతరం ఖిల్లా అభివృద్ధికి సర్పంచ్‌ సేవలు చేస్తున్నారని, అదేవిధంగా కరోనా కట్టడికి ఆయన తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మండలంలోని ప్రతి సర్పంచ్‌ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మానాజీపేట గ్రామ యువకులు పాల్గొన్నారు.