మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jul 12, 2020 , 07:30:52

కుటుంబ స్థాయిలో అవగాహన కల్పించాలి

కుటుంబ స్థాయిలో అవగాహన కల్పించాలి

  • డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌

నారాయణపేట టౌన్‌: వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలు, సేవల పట్ల కుటుంబ స్థాయిలో అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్‌ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1987 జులై 11వ తేదీన ప్రపంచ జనాభా 500 కోట్లు పూర్తయిందన్నారు. అయితే 1989 జులై 11నుంచి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 15రోజులపాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధిక జనాభా వల్ల కలిగే నష్టాలు, పరిమిత కుటుంబాల వలన కలిగే ప్రయోజనాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్లలకు 18ఏండ్లు, మగ పిల్లలకు 21 ఏండ్లు పూర్తయ్యాక వివాహాలు జరిపించేలా, బిడ్డకుబిడ్డకు 3ఏండ్లపాటు ఎడం ఉండేలా ప్రజలకు అవగాహన పెంచాలన్నారు.

కుటుంబ నియంత్రణలో భాగంగా పురుషుల్లో వేసెక్టమీ ఆపరేషన్‌ విషయంలో ఉన్న అపోహలను తొలగించి, పురుషులు వేసెక్టమీ ఆపరేషన్‌ చేసుకునేందుకు ముందుకొచ్చేలా కృషి చేయాలన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులైన కాపర్‌ టీ, ఓరల్‌ పిల్స్‌ తదితర వాటిపై ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కుటుంబ నియంత్రణ పద్ధ్దతులపై ఎలాంటి అనుమానాలు, సందేహాలు ఉన్నా ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీల్లో సంప్రదించాలని ప్రజలకు సూచించాలన్నారు. కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పక్షం రోజులపాటు చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. అనంతరం కొవిడ్‌- 19 నియంత్రణలో, ఆరోగ్య కార్యక్రమాల అమలులో మెరుగైన సేవలను అందించిన పలువురు వైద్యసిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి శైలజ, ఎన్‌సీడీపీవో సిద్ధప్ప, జిల్లాలోని పీహెచ్‌సీల వైద్యాధికారులు, డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.