ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 12, 2020 , 07:25:18

జూరాలకు 1,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

జూరాలకు 1,037 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • తుంగభద్రకు పోటెత్తుతున్న వరద

ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉధృతి తగ్గుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలకుగానూ శనివారం సాయంత్రం వరకు 7.778 టీఎంసీలు ఉన్నది. ఇన్‌ఫ్లో 1,037 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,488 క్యూసెక్కులు నమోదైంది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, భీమా ఎత్తిపోతలకు 650 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆల్మట్టి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్ట్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 92.45 టీఎంసీలు ఉన్నది. ఇన్‌ఫ్లో 73,791, అవుట్‌ఫ్లో 21,130 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్‌ ప్రా జెక్ట్‌లో 37.64 టీఎంసీలకుగానూ 29.88 టీఎంసీల నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 27,756, అవుట్‌ఫ్లో 25 క్యూసెక్కులుగా నమోదైంది. 

తుంగభద్రలో 34,374 క్యూసెక్కుల ఇన్‌ఫ్ల్లో..

అయిజ : తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ నదికి వరద ఉధృతి కొనసాగుతుండగా, దిగువకు విడుదల చేస్తుండటంతో టీబీ డ్యాంకు వరద పెరుగుతున్నది. శనివారం తుంగభద్ర జలాశయంలోకి 34,274 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా, 302 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతున్నది. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 18.274 టీఎంసీల నిల్వ ఉన్నది. 1633 అడుగుల నీటి మట్టానికిగానూ 1598.85 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. టీబీ డ్యాం ఎగువన ఉన్న శివమొగ్గ, ఆగుంటె, తీర్థహళ్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యాంకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

శ్రీశైలంలో నిలకడగా నీటిమట్టం

శ్రీశైలం : కృష్ణానది పరీవాహక ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద మొదలైనప్పటికీ ప్రస్తుతం నీటిమట్టం నిలకడగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, 215.807 టీఎంసీలు కాగా.., శనివారం సాయంత్రానికి ప్రస్తుత నీటిమట్టం 814.70 అడుగులు, 37.1936 టీఎంసీలుగా నమోదవుతున్నది. కుడిగట్టు, ఎడమగట్టులలో విద్యుదుత్పత్తి చేయడం లేదు. రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌ నుంచి ఎటువంటి నీరు విడుదల కావడం లేదు.