బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 11, 2020 , 02:16:41

1907 కిలోమీట‌ర్లు.. 7.63ల‌క్ష‌ల మొక్క‌లు

1907 కిలోమీట‌ర్లు.. 7.63ల‌క్ష‌ల మొక్క‌లు

  • ఎవెన్యూ ప్లాంటేషన్‌పై అధికారుల దృష్టి
  • పచ్చదనం పరుచుకోనున్న రహదారులు
  • పీఆర్‌ రోడ్లు 1,387 కి.మీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు 520 కి.మీ.
  • కిలోమీటర్‌కు400 మొక్కల లక్ష్యం

వనపర్తి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అనునిత్యం కృషి చేస్తున్నారు.. ఆయా శాఖల తరఫున లక్ష్యాలకనుగుణంగా ముందుకు సాగుతున్నారు.. ఈ క్రమంలో ఆరో విడుత హరితహారంలో భాగంగా అధికారులు ఎవెన్యూ ప్లాంటేషన్‌పై దృష్టి సారించారు.. జిల్లాలో ఉన్న 1,907 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేపట్టారు.. ప్రతి కిలోమీటర్‌కు 400 మొక్కల చొప్పున మొత్తం 7.63 లక్షలు నాటనున్నారు.. డంపింగ్‌యార్డులు, క్రిమిటోరియాలు, సెగ్రిగేషన్‌ షెడ్‌ సరిహద్దుల వెంట మూడు వరుసల్లో మొక్కలు పెట్టనున్నారు..

వనపర్తి, నమస్తే తెలంగాణ : హరితహారం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతున్నది. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తూ రహదారుల వెంట మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు అన్ని ప్రధాన రోడ్ల వెంట మూడు వరుసల్లో మొక్కలు నాటనున్నారు. రోడ్డుకు అనుకొని ఉన్న వ్యవసాయ భూములకు అధికారులు హద్దులు నిర్ణయిస్తున్నారు. రైతులు ఎక్కడైనా రహదారులను ఆక్రమించుకుంటే వెంటనే ఖాళీ చేసేందుకు అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి రోడ్డు స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల సాయంతో రోడ్డు స్థలాలకు హద్దులు నిర్ణయిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా 1,387 కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్‌ రోడ్లు, 520 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉన్నాయి. మొత్తం 1,907 కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్‌ కింద ప్రతి కిలోమీటర్‌కు 400 మొక్కల చొప్పున ఈ రోడ్ల వెంట 7.63 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అన్ని రహదారుల పక్కన ఉన్న పిచ్చిమొక్కలను, కంప చెట్లను తొలగిస్తున్నారు. జేసీబీల సాయంతో నేలను చదును చేస్తున్నారు.

మూడు వరుసల్లో మొక్కలు

గతంలో రోడ్డు పక్కన ఒకే వరుసలో మొక్కలు నాటారు. ఈ మొక్కలు రోడ్లకు ఆనుకొని ఉండటం, కొందరు రైతులు తమ పొలాల పక్కన మొక్కలు ఉండడంతో నరికి వేయడం వంటివి చేశారు. దీంతో అంతగా సక్సెస్‌ కాలేదు. ఈ ఏడాది అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు మూడు వరుసల్లో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నమిలి, కానుగ, వేప, అశోక వంటి ఏపుగా పెరిగే మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు అన్ని గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డు, క్రిమటోరియం, సెగ్రిగేషన్‌షెడ్‌ల పరిసరాల్లోనూ మొక్కలు నాటుతున్నారు. ఇక్కడ కూడా మూడు వరుసల్లో ఎత్తు ప్రకారం పెరిగే మొక్కలు పెంచనున్నారు. దీంతో ప్రహరీ అవసరం లేకుండా, పచ్చదనం వెల్లివిరియనున్నది.

రోడ్లకిరువైపులా నాటుతున్నాం..

రోడ్లకిరువైపులా మొక్కలు నాటుతున్నాం. వాటిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రహదారుల వెంట 7.63 లక్షల మొక్కలను పంచాయతీ రాజ్‌శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. ఈ అదనపు మొక్కలతో జిల్లాలో మొత్తం 47 లక్షల టార్గెట్‌ విధించుకున్నాం.రోడ్లకిరువైపులా ఉన్న వ్యవసాయ భూములు వద్ద సరిహద్దులను నిర్ణయించి మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నాం. డంపింగ్‌యార్డు, క్రిమిటోరియం, సెగ్రిగేషన్‌ షెడ్‌ల వద్ద కూడా మొక్కలు పెంచుతున్నాం.

- బి.రాజేశ్వరి, పంచాయతీరాజ్‌ శాఖ జిల్లా అధికారి, వనపర్తి