ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jul 10, 2020 , 02:58:40

ఇంటికే అంగ‌న్‌వాడీ సేవ‌లు

ఇంటికే అంగ‌న్‌వాడీ సేవ‌లు

  • కొవిడ్‌ నిబంధనలతో నిర్ణయం 
  • లబ్ధిదారులకు సరుకుల పంపిణీ
  • వనపర్తి జిల్లాలో 589 అంగన్‌వాడీలు, 32,880 మందికి లబ్ధి

వనపర్తి, నమస్తే తెలంగాణ : రోజు రోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం సంక్షేమ కార్యక్రమాలను ఎక్కడా నిలిపివేయడం లేదు. సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అంగన్‌వాడీల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు నిత్యం అందిస్తున్న పోషకాహాకారాలను క్రమం తప్పకుండా అందిస్తున్నారు. కరోనా నుంచి లబ్ధిదారులను కాపాడేందుకు వంట సరుకులను ఇంటికే పంపిణీ చేస్తున్నారు. వనపర్తి జిల్లాలోని 589 అంగన్‌వాడీల్లో 25 రోజులుగా ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని 3,473 గర్భిణులకు, 3,086 బాలింతలకు, 26,321 మంది చిన్నారులకు వంట సరుకులు పంపిణీ చేస్తున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేసినప్పటికీ అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.  

589 అంగన్‌వాడీలు

వనపర్తి జిల్లాలో మొత్తం 589 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను మెయిన్‌ అంగన్‌వాడీలు 545, మినీ అంగన్‌వాడీలు 44 ఉన్నాయి. మెయిన్‌ అంగన్‌వాడీల్లో ఒక టీచర్‌, ఆయా చొప్పున 1,090 మంది సిబ్బంది, 44 మినీ అంగన్‌వాడీల్లో 44మంది టీచర్ల మొత్తం 1,134 మంది మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున విధులు నిర్వహిస్తున్నారు. ఈ అంగన్‌వాడీల పరిధిలో గర్భిణులు 3,473మంది, బాలింతలు 3,086 మందిగా మొత్తం మహిళలు 6,559 మంది ఉండగా చిన్నారులు 7నెలల నుంచి ఏడాదిలోపు 4,319 మంది, ఏడాది నుంచి మూడేండ్ల లోపు చిన్నారులు 11,258 మంది, మూడేండ్ల నుంచి ఆరేండ్లలోపు చిన్నారులు 10,744 మంది మొత్తం 26,321 మంది ఉన్నారు. 32,880 మంది లబ్ధిదారులకు క్రమం తప్పకుండా అంగన్‌వాడీ టీచర్లు సరుకులు అందిస్తున్నారు. 

వంట సరుకుల పంపిణీ

కరోనా ప్రభావం లేక ముందు అంగన్‌వాడీ టీచర్లు తమ పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారాలను అందించే వారు. లబ్ధిదారులకు సరిపడా వంటలు చేసి పోషక విలువలతో కూడిన ఆహారం అందించే వారు. నాలుగు నెలలుగా కరోనా ప్రబలుతుండటంతో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోషకాహారాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్‌వాడీ పాఠశాలల్లో  చిన్నారులకు తరగతులను రద్దు చేసి మహిళలకు, చిన్నారులకు అందించాల్సిన పోషకాహారాలను ఇంటికే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. ఒక రోజుకు లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తున్న సరుకులను లెక్కగట్టి పంపిణీ చేస్తున్నారు.

రోజువారీగా అందిస్తున్న సరుకులు

అంగన్‌వాడీ టీచర్లు, మహిళలకు, చిన్నారులకు వేరువేరు రకాలుగా సరుకులను అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు నిత్యం 150గ్రాముల బియ్యం, 30గ్రాముల కందిపప్పు, 16గ్రామాలు నూనె, 200మి.లీ పాలు, ఒక గుడ్డు అందిస్తున్నారు. ఇక మూడు నుంచి ఆరేండ్ల మధ్య వయసున్న చిన్నారులకు 75గ్రామలు బియ్యం, 15గ్రాములు కందిపప్పు, 6గ్రాముల నూనె, ఒక గుడ్డు అందిస్తున్నారు. మూడేండ్ల లోపు చిన్నారులకు బాలామృతాన్ని, స్నాక్స్‌ఫుడ్‌ను అందిస్తున్నారు. 

లబ్ధిదారులందరికీ పంపిణీ

కరోనా సమయంలో సంక్షేమ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వ ఆదేశాలతో సరుకులను ఇంటికే పంపిస్తున్నాం. జిల్లాలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మొత్తం 32,880 మంది లబ్ధిదారులకు ప్రతిరోజు సరుకులు పంపిణీ చేస్తున్నాం. వ్యాధి ప్రబలకుండా పంపిణీలో నిబంధనలు పాటిస్తున్నాం. 20 రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది.

- నర్సయ్య, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి, వనపర్తి జిల్లా