శుక్రవారం 27 నవంబర్ 2020
Wanaparthy - Jul 10, 2020 , 02:56:12

కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌కు క‌రోనా బ్రేక్‌

కో ఆప్ష‌న్ ప‌ద‌వుల‌కు క‌రోనా బ్రేక్‌

  • కరోనా నేపథ్యంలో ఎన్నిక మరింత ఆలస్యం
  • ఆశావహులకు తప్పని ఎదురుచూపులు
  • కొత్తచట్టం ప్రకారం నాలుగు కోఆప్షన్లు
  • వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు

ఆత్మకూరు: మున్సిపల్‌ పాలకవర్గాలు ఏర్పడిన మూడు నెలల్లోపే కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఆరు నెలలైనా ఎన్నిక కాలేదు. జనవరి నెలాఖరున మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఏర్పడగా నోటిఫికేషన్‌ జారీకి కరోనాతో బ్రేక్‌ పడింది. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో నోటిఫికేషన్‌ జారీ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో కోఆప్షన్‌పై ఆశలు పెట్టుకున్న వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. వనపర్తి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. వనపర్తి మినహా కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత నాలుగు మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఐదు మున్సిపాలిటీల్లోనూ జనవరి 22న ఎన్నికలు జరుగగా 28న కొత్త పాలకవర్గాలు ఏర్పడ్డాయి. కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు కొంతమేర సమయం తీసుకున్నారు పాలకవర్గాలు. నూతన పుర చట్టం సైతం మూడు నెలల సమయం ఇవ్వడంతో కొంత జాప్యం జరిగి ఎన్నిక నిర్వహిద్దామనుకున్నారు. అప్పటికే ఆశావహుల సందడి ఎక్కువ కాగా ఎమ్మెల్యే, మంత్రుల సూచనల మేరకు పాలకవర్గాలు కొంత స్తబ్ధత పాటించాయి. ఈ గ్యాప్‌లో కరోనా వైరస్‌ రేపిన కలకలానికి కోఆప్షన్‌ సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్‌ వాయిదా పడింది. 

హామీలతో ఆశావహుల్లో పోటీ తీవ్రం

మున్సిపల్‌ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ టికెట్లను ఆశించి భంగపడిన పలువురు ఆశావహులకు కోఆప్షన్‌ సభ్యులుగా నియమిస్తామని మంత్రి, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారనే ధీమాతో కొంతమంది ఉన్నారు. ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్‌ కౌన్సిల్‌ అధికారంలోకి రావడంతో కోఆప్షన్‌ సభ్యత్వ పదవులకు టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు నాయకులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. జనవరిలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక్కో వార్డు నుంచి ఐదారుగురు టీఆర్‌ఎస్‌ నాయకులు పోటీపడ్డారు. అయితే గెలుపుగుర్రాలకే అవకాశం ఇచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలు టికెట్లు ఆశించిన పలువురు నాయకులకు కోఆప్షన్‌ పదవులు ఇస్తామని హమీ ఇచ్చినట్లు తెలిసింది. వారంతా ఇప్పుడు అధినాయకుల అండదండలు తమకే ఉన్నాయంటూ కోఆప్షన్‌ పదవి తమకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. వారితో పాటు మరికొంత మంది సీనియర్‌ నాయకులు కూడా కోఆప్షన్‌ పదవుల కోసం ఎవరికి వారే పైరవీలు చేస్తున్నారని సమాచారం.

లాక్‌డౌన్‌ సడలింపులతో..

కరోనా కోరలు చాచడంతో లాక్‌డౌన్‌ కారణంగా అన్నీ మూతపడగా పనులన్నీ ఆగిపోయాయి. కోఆప్షన్ల భర్తీని సైతం ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ సడలింపులు జరుగగా ఆశావహుల్లో మళ్లీ ఆశలు రేకెత్తాయి. కరోనా వైరస్‌కు ఓవైపు భయపడుతూనే మరోవైపు కోఆప్షన్‌ పదవుల కోసం పైరవీలు ప్రారంభించారు. నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తూనే పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం తిరుగుతున్నారు. మొత్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతో ఆశావహుల గుండెల్లో పదవుల ఆశలు పునర్జీవం పోసుకున్నాయి.