శుక్రవారం 04 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 09, 2020 , 00:19:59

ప్రాణం మీదికి తెచ్చిన భూముల పంచాయితీ

ప్రాణం మీదికి తెచ్చిన భూముల పంచాయితీ

  • భార్యాభర్తలపై కత్తితో దాడి
  • సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ అపూర్వరావు

వనపర్తిక్రైం/ గోపాల్‌పేట : భూతగాదాల విషయంలో భార్యాభర్తలపై కత్తితో దాడి చేసిన సంఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్ధారంలో బుధవారం చోటు చేసుకుంది. వనపర్తి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వివరాలను వెల్లడించారు. బుద్ధారం గ్రామానికి చెందిన మునగాల అర్జునయ్య అలియాస్‌ అర్జున్‌రావుకు అదే గ్రామానికి చెందిన అర్రు అనంతరావుకు 2002 నుంచి భూమి అమ్మకం విషయంలో కొన్ని గొడవలు ఉన్నాయి.

2002లో అర్రు అనంతరావు మధ్యవర్తిగా వ్యవహరించి అర్జునయ్యకు చెందిన 2 ఎకరాల 36 గుంటల పొలం ఇతరులకు అమ్మించాడు. ఆ తర్వాత అర్జునయ్య తన భూమి వివరాలను సరిచూసుకోగా తాను అమ్మిన భూమితో పాటు మరో 28 గుంటలు అదనంగా అనంతరావు తన పేరిట పట్టా చేసుకున్నట్లు గుర్తించాడు. ఈ విషయంలో గ్రామంలో పలు మార్లు పంచాయితీ పెట్టినా పట్టించుకోకపోవడంతో ఇటీవల గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. పోలీసుల సమక్షంలో అనంతరావు తన తప్పును ఒప్పుకొని 28 గుంటల భూమికి రూ.7.50లక్షలు చెల్లిస్తానని అంగీకరించాడు. అయినా నేటికీ అనంతరావు ఒప్పుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో బుధవారం అర్జునయ్య తన భార్య శేషమ్మ, కొడుకు నరేందర్‌రావు,

మనుమడు ప్రశాంత్‌రావుతో కలిసి అనంతరావును నిలదీశాడు. ఈ క్రమంలో జరిగిన గొడవలో నరేందర్‌రావు మొదట కర్రతో అనంతరావు తలపై బాదాడు. దీన్ని గమనించిన అనంతరావు భార్య రత్నమ్మ వారికి అడ్డువెళ్లగా అక్కడే ఉన్న శేషమ్మ రత్నమ్మ జుట్టు పట్టి కింద పడేసింది. అనంతరం అప్పటికే కోపంతో రగిలిపోతున్న అర్జునయ్య మటన్‌ కొట్టే కత్తితో రత్నమ్మ మెడపై దాడి చేశాడు. చికిత్స కోసం వనపర్తి ప్రభు త్వ దవాఖానకు తరలించి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సంఘటనా స్థలానికి ఎస్పీ అపూర్వరావు, సీఐ సూర్యానాయక్‌, ఎస్సై రామన్‌గౌడ్‌ చేరుకొని సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. నలుగురి నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు డీఎస్పీ తెలిపారు.