బుధవారం 25 నవంబర్ 2020
Wanaparthy - Jul 08, 2020 , 01:14:05

చీటి ఉంటేనే.. మందులు

చీటి ఉంటేనే.. మందులు

  • మెడికల్‌ దుకాణాలకు ఆదేశాలు   
  • కరోనా కట్టడికి వైద్యాధికారుల చర్యలు
  • వనపర్తి జిల్లాలో 232 మెడికల్‌ షాపులు
  • సొంత వైద్యం ప్రమాదం   
  • ఓవర్లీ ది కౌంటర్‌ డ్రగ్స్‌ అమ్మొద్దు

వనపర్తి, నమస్తే తెలంగాణ: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాధి నుంచి త్వరగా కోలుకునేందుకు వైద్యాధికారులు పలు చర్యలు చేపట్టారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి వ్యాధులకు సొంత వైద్యం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. డాక్టర్‌ చీటి ఉంటేనే రోగులకు మందులు విక్రయించాలని మెడికల్‌ దుకాణాల యాజమాన్యులకు ఔషధ తనిఖీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదివరకు అమలులో ఉన్న ఓవర్లీ ది కౌంటర్‌ డ్రగ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించొద్దని హెచ్చరిస్తున్నారు. కరోనాతోపాటు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండటంతో తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ప్రతి వానకాలంలో చాలా మందికి సీజనల్‌ వ్యాధులు జలుబు, దగ్గు, జర్వం, గొంతునొప్పి వస్తుంటాయి. చాలావరకు ప్రజలు అందుబాటులో ఉండే మెడికల్‌ దుకాణాలకు వెళ్లి మందులు తీసుకుంటారు. ఈ విధానానికి స్వస్తి పలకాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మెడికల్‌ దుకాణాల యాజమాన్యులను ఆదేశాలిస్తున్నారు. 

డాక్టర్‌ చీటి తప్పనిసరి

ప్రస్తుత పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చినప్పుడు సొంత వైద్యం మానుకోవాలని ఔషధ తనిఖీ అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రధాన లక్షణాలు వానకాలం సీజన్‌లో వచ్చే వ్యాధులు ఒకటే కావడంతో సొంతంగా వైద్యాన్ని మానుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అనారోగ్యాలు తలెత్తినా ప్రభుత్వం, ప్రైవేట్‌ వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. డాక్టర్లు సూచించిన మందుల చీటితోనే మందులు విక్రయించి వినియోగించాలి. 

కౌంటర్‌ డ్రగ్స్‌కు అనుమతి లేదు

సీజనల్‌ వ్యాధులకు కూడా డాక్టర్‌ చీటి లేకుండా మెడికల్‌ దుకాణాల్లో మందులు ఇచ్చే విధానాన్ని ఓవర్లీ ది కౌంటర్‌ డ్రగ్స్‌గా పిలుస్తున్నారు. ఈ విధానాన్ని అనుసరించొద్దని ఔషధ తనిఖీ అధికారులు మెడికల్‌ షాపుల యాజమాన్యాలను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్‌ వ్యాధులు వచ్చాయా.. లేక కరోనా వచ్చిందా.. తెలియకుండా మందులు వినియోగించడం వల్ల ప్రతిఫలం ఉండదు. కరోనా సోకిన వ్యక్తి మెడికల్‌ దుకాణాలకు వెళ్లి మందులు కొనుగోలు చేసి వినియోగించినా.. వ్యాధి నయమయ్యే అవకాశాలు ఉండవు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఓవర్లీ ది కౌంటర్‌ డ్రగ్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించొద్దని మెడికల్‌ దుకాణాలకు వైద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

వనపర్తి జిల్లాలోని 232 మెడికల్‌ దుకాణాల్లో కొవిడ్‌ నిబంధలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. మెడికల్‌ షాపుల కౌంటర్‌ వద్ద వినియోగదారులు లోపలికి రాకుండా రోప్‌ను కట్టాలి. దుకాణాలకు ప్రవేశంలోనే శానిటైజర్‌ లిక్విడ్‌ను అందుబాటులో ఉంచాలి. దుకాణంలోని సిబ్బంది మాస్కులు, చేతికి గ్లౌస్‌లు ధరించాలి.