బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Jul 08, 2020 , 01:14:03

కరోనా కరాళ నృత్యం

కరోనా కరాళ నృత్యం

  • ఉమ్మడి జిల్లాలో 17మందికి పాజిటివ్‌, ముగ్గురు మృతి 

వనపర్తి వైద్యం/ మహబూబ్‌నగర్‌ రూరల్‌/ కొల్లాపూర్‌/ శ్రీశైలం/మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/ మక్తల్‌ రూరల్‌/     గద్వాలటౌన్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం  17 కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. వనపర్తి జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డాక్టర్‌ రవిశంకర్‌ తెలిపారు. కొత్తకోట పట్టణంలో ఓ వ్యక్తికి, పెబ్బేరు మండల కేంద్రంలోని  ఏడాది బాలుడికి  పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన వివరించారు. కొత్తకోట పాజిటివ్‌ కేసుకు సంబంధించి ఐదుగురు ప్రైమరీ కాంటాక్ట్స్‌, పెబ్బేరు పాజిటివ్‌ కేసులో ముగ్గురు ప్రైమరీ కాంటాక్ట్స్‌ను హోం క్వారంటైన్‌ చేసినట్లు తెలిపారు. 

వీరిలో కొత్తకోటకు చెందిన వ్యక్తి ప్రస్తుతం హైదారాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. మహబూబ్‌నగర్‌ మండలంలోని ఇప్పలపల్లిలో ఓ వ్యక్తి ఇటీవల హైదరాబాద్‌లో పని చేసుకోవడానికి వెళ్లి అక్కడ ఓ డాక్టర్‌ ఇంట్లో పని చేస్తుండగా జ్వరం రావడంతో ఇంటికి వచ్చాడు. అనుమానం వచ్చి పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చిందని గ్రామ సర్పంచ్‌ వెంకటయ్య తెలిపారు. కొల్లాపూర్‌ పట్టణంలో 58 ఏండ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది.  ఈ నెల 3న అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఓ దవాఖానకు వెళ్లాడు. అక్కడి నుంచి సోమవారం గాంధీ దవాఖానలో చేరాడు. మంగళవారం వైద్యులు కొవిడ్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా గుర్తించారు. 

సదరు వ్యక్తి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ఉన్న 19 మందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. శ్రీశైలం క్షేత్రం పరిధిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చినట్లు కొవిడ్‌ నివారణ అధికారి డాక్టర్‌ సోమశేఖర్‌ తెలిపారు. సున్నిపెంటలో ఓ ఐఐటీ విద్యార్థి, దేవస్థానంలో సెక్యూరిటీగా విధులు నిర్వహించే యువకుడికి, శ్రీశైలంలోని కొత్తపేట శ్రీగిరికాలనీకి చెందిన 53ఏండ్ల వ్యక్తికి కరోనా వచ్చింది. పాలమూరు జిల్లా కేంద్రంలోని వీరన్నపేటకు చెందిన ఓ మహిళా డాక్టర్‌కు, ఎస్వీఎస్‌ మెడికల్‌ కళాశాల పీజీ వైద్య విద్యార్థికి, లక్ష్మీనగర్‌ కాలనీలో ఇద్దరికి పాజిటివ్‌ రాగా అందులో ఓ హెల్త్‌ఎడ్యుకేటర్‌ ఉన్నారు. హనుమాన్‌పురలో నివాసం ఉంటున్న ఓ మహిళకు పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. 

కోయిలకొండ మండలం వింజమూర్‌కు చెందిన ఓ వ్యక్తి నిమ్స్‌లో చికిత్స పొందతుండగా పాజిటివ్‌ వచ్చినట్లు రిపోర్టు వచ్చింది. మక్తల్‌ మండలం కర్ని సర్పంచ్‌ కరోనా వైరస్‌తో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు స్థానిక వైద్యులు తెలిపారు. 15 రోజుల క్రితం అస్వస్థతకు గురైన సర్పంచ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చేర్చించారు. ఆరు నెలల క్రితం ఆయనకు గుండెకు సంబంధించి బైపాస్‌ సర్జరీ చేశారు. చికిత్స పొందుతుండగా కరోనా లక్షణాలు  కనిపించడంతో వైద్య  పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. మంగళవారం ఉదయం మరోసారి స్ట్రోక్‌ రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. 

గద్వాల జిల్లాలో మరో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో గద్వాలకు చెందిన ఆశా వర్కర్‌, భీంనగర్‌కు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చిన తర్వాత మృతిచెందాడు. దీంతో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను హోంఐసోలేషన్‌లో ఉంచారు. అయిజకు చెందిన ఓ వ్యక్తి, రాజోలికి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. గద్వాలలోని రెండో రైల్వేగేట్‌ సమీపంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళా కరోనా బారిన పడింది. ఈమె హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.