సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jul 06, 2020 , 07:26:31

జూరాలకు కొనసాగుతున్న వరద

జూరాలకు కొనసాగుతున్న వరద

ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువన కురుస్తున్న వర్షాలతో క్రమంగా వరద పెరుగుతున్నది. ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 9.66 టీఎంసీలకుగానూ 7.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 5,703 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 448 క్యూసెక్కులుగా నమోదైంది. వరద పెరగుతుండటంతో నెట్టెంపాడుకు నీటి విడుదలను ప్రారంభించారు. గుడెందొడ్డిలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 385 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువన ఉన్న అల్మట్టి ప్రాజెక్ట్‌కు స్వల్పంగా వరద కొనసాగుతున్నది. పూర్తి స్థాయి నీటి సామర్థ్య 129.72 టీఎంసీలకుగానూ 73.34 టీఎంసీలు ప్రస్తుతం నమోదుకాగా.. ఇన్‌ఫ్లో 9,359 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,130 క్యూసెక్కులుగా నమోదైంది. అలాగే నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ 24.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్‌ఫ్లో 163 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 25 క్యూసెక్కులుగా నమోదైంది. 

టీబీ డ్యాంకు 751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అయిజ : కర్ణాటకలోని హోస్పేట్‌ సమీపంలోని ఉన్న టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం 751 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కర్ణాటక, ఏపీ రాష్ర్టాల్లో తాగునీటి అవసరాల నిమిత్తం 290 క్యూసెక్కులను విడుదల చేస్తున్నట్లు డ్యాం సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. 100.86 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 10.849 టీఎంసీల నీరు నిల్వ ఉంది.