గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Jul 06, 2020 , 07:19:25

ఆరోగ్య ఫ‌లం... నేరేడు

ఆరోగ్య ఫ‌లం... నేరేడు

మరిపెడ : అల్లనేరేడు పండును ఔషధ ఫలంగా పిలుస్తారు. ఈ పండ్లు జూన్‌, జూలై మాసంలో విరివిగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేడి నుంచి ఉపశమనం, చలువను అందిస్తాయి. ఆకలిని పుట్టిస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తాయి. విరేచనాలను నివారిస్తాయి. గుండె రక్తంలోని ఉష్ణాన్ని పోగొడతాయి. అల్లనేరేడు పండ్లు షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలని డాక్టర్లు చెబుతుంటారు. రక్తశుద్ధి, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని తగ్గించడం, తరచూ దాహం, అతి మూత్ర బాధను తగ్గించి.. జీర్ణాశయం, లివర్‌కు వ్యాపించే సర్వ రోగాలను నయం చేస్తాయని ప్రతీతి. గుండె, మెదడు వ్యాధులకు ఇవి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఈ పండ్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధులు మటుమాయం. కడుపులో నులి పురుగులను నివారిస్తుంది. మూత్రాశయ, నోటి, క్యాన్సర్‌కు టానిక్‌లా పనిచేస్తుంది. చెట్టు ఆకులను గాయంపై కట్టవచ్చు. శరీరంపై కాలిన గాయాలుంటే తర్వాత మచ్చలు ఏర్పడకుండా నివారిస్తుంది. చిగుళ్ల వ్యాధులతో బాధపడేవారు ఈ చెట్టు ఆకుల రసాన్ని నోట్లో వేసుకుని పుక్కిలిస్తే చాలా మంచిది. పుల్లలతో పళ్లు తోమితే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసనను నివారిస్తుంది. 

పల్లెల్లో విరివిరిగా..

పల్లెల నుంచి పట్టణాలకు అల్లనేరేడు పండ్లను గంపల్లో తీసుకొచ్చి అమ్మకాలు చేస్తుంటారు. పల్లె జనానికి తక్కువ ధరకు లభించే ఈ పండ్లు పట్టణవాసులకు మాత్రం కిలో రూ.100 నుంచి రూ.200వరకు డిమాండ్‌ను బట్టి అమ్మకాలు జరుపుతారు.

నేరేడు పండు పానీయం..

బాగా పండిన నేరేడు పండ్లను పిసికి గింజలు తీసి వేసి ఆ గుజ్జును తూకం వేసి, సమానంగా పటిక బెల్లం దానిలో కలిపి కరిగించి చిన్న మంటపైన పాకం వచ్చే వరకు మరిగించి దించి నిల్వ చేసుకోవాలి. రోజూ రెండు చెంచాలు మోతాదుగా ఈ పాకాన్ని అరగ్లాసు మంచినీటిలో కలిపితే తీయని రుచికరమైన పానీయంగా ఉంటుంది. దీన్ని తాగితే పొడిదగ్గు, రక్త క్షీణత, గొంతు సమస్యలు నివారించవచ్చు.

అనేక పోషకాలు..

ఈ పండ్ల చెట్ల ఆకులు, బెరడులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఏ, బీ, సీ మిటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పిండి పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. సోడియం, కాల్షియం, మినరల్స్‌, కార్బోహైడ్రైట్స్‌, ప్రోటీన్లు, జింకు, పొటాషియంతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో ఉంటాయి. అల్లనేరేడు పండ్లల్లో సూక్ష్మమైన పురుగులు ఉండే అవకాశం ఉంది. నోరూరించే ఫలాలని ఎక్కువగా తీసుకోవద్దు. ఎక్కువ తింటే గొంతు పట్టేస్తది. అదేవిధంగా పొద్దున్నే కాలికడుపుతో తినొద్దు. పిల్లలకు పాలిచ్చే తల్లులు వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.