సోమవారం 06 జూలై 2020
Wanaparthy - Jun 30, 2020 , 05:50:45

పెద్దగూడెం కల నెరవేరింది

పెద్దగూడెం కల నెరవేరింది

  •  రూ.79 లక్షలతో లిఫ్ట్‌ ఏర్పాటు
  • 1500 ఎకరాలకు సాగునీళ్లిస్తాం
  • వ్యవసాయ  మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రూరల్‌ : పెద్దగూడెం వాసులకు వచ్చిన మాట మేరకు ఖాన్‌ చెరువు సాగునీటి లిఫ్ట్‌ను పూర్తి చేసి గ్రామంలోని రాములోరి పాదాలు కడుగుతామని  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో సాగునీరు అందించే ఖాన్‌ చెరువు లిఫ్ట్‌ పనులను జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పయనీరు విత్తన సంస్థ సామాజిక బాధ్యతతో రైతులకు మేలు చేసేందుకు లిఫ్ట్‌ చేపట్టాలని కోరామని చెప్పారు. రూ.79 లక్షలతో 120 హెచ్‌పీ మోటర్‌తో ఖాన్‌ చెరువును నింపేందుకు లిఫ్ట్‌ పనులు చేసేందుకు ముందుకొచ్చిందని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన పూర్తి బాధ్యతను రాంకీ సంస్థకు అప్పగించిందని వివరించారు.

  ఈ పనులు పూర్తయితే చెరువు కింద దాదాపు 1500 ఎకరాలు సాగులోకి రానుండటంతోపాటు 400 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎన్నికలకు ముందే ఈ చెరువుకు సాగునీరు అందించాలన్న ఆలోచనతో గ్రామశివారులో కాల్వ పనులకు భూమి పూజ నిర్వహించామన్నారు. కానీ విపక్ష నేతల తప్పుడు ఫిర్యాదులతో నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆ సందర్భంలోనే గ్రామానికి సాగునీరు తప్పక అందిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి పనులు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. లిఫ్ట్‌ నిర్వహణకు సామాజిక బాధ్యతతో గ్రామంలో కమిటీని ఏర్పాటు చేసుకొని వేగంగా పనులు కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలో చిన్న, పెద్ద తరహా కలిపి 40 లిప్టులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకూ సాగునీళ్లు అందిస్తామని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.  రైతు బంధు, బీమా, ఉచిత కరెంటు, సాగునీటి రాకతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం  పెరిగిందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించాలని సూచించారు.

సమావేశాలలో ఎక్కువగా జనం గుమికూడవద్దని, ఏదైనా జరగరానిది జరిగితే అందరం బాధ్యులమవుతామని చెప్పారు. అనంతరం గ్రామంలో వైకుంఠధామాన్ని మంత్రి ప్రారంభించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, డీఆర్డీవో కోదండరాములు,  ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్‌ కొండన్న, ఉపసర్పంచ్‌ భాస్కర్‌గౌడ్‌, ఎంపీటీసీ ధర్మానాయక్‌, కురుమూర్తి, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ ఉస్మాన్‌, రైతుబంధు సమితి సమన్వయకర్త నరసింహ, రాష్ట్ర మార్కెటింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, ఎంపీడీవో రఘునాథ్‌రెడ్డి, ఎంపీవో రవీంద్రబాబు, వనపర్తి సహకార సంఘం చైర్మన్‌ వెంకట్రావ్‌, మధుసూదన్‌, రఘువర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మాణిక్యం, విష్ణుయాదవ్‌, కురుమూర్తి, బాలకృష్ణ, శ్రీనివాసులు, సుదర్శన్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


logo