సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jun 24, 2020 , 03:15:27

రూ.300 కోట్లతో ‘భగీరథ’ ప్లాంట్‌

 రూ.300 కోట్లతో ‘భగీరథ’ ప్లాంట్‌

  • మున్సిపాలిటీల్లో పంద్రాగస్టు నాటికి కమ్యూనిటీ టాయిలెట్లు పూర్తి
  • హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించాలి 
  •  అధికారుల సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి
  • హాజరైన జెడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్యేలు 
  • వనపర్తి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ ప్రారంభం

 ‘వనపర్తి పట్టణానికి మహర్దశ పట్టనున్నది. ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకుగానూ మిషన్‌ భగీరథ ప్లాంట్‌ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ రూ.300 కోట్లు మంజూరు చేశారు. టెండర్లు పిలిచి త్వరగా పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’.. అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షకు జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మక్తల్‌, దేవరకద్ర ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామన్‌పాడు తాగునీటి సరఫరాలో ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి ప్లాంట్‌ను మంజూరు చేశారని చెప్పారు.

  వనపర్తి, నమస్తే తెలంగాణ :  వనపర్తి పట్టణంలో తాగునీటి సరఫరా కోసం నిర్మించనున్న మిషన్‌ భగీరథ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.300 కోట్లు మంజూరు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మక్తల్‌, దేవరకద్ర ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై మంత్రి చర్చించారు.  ప్రస్తుతం రామన్‌పాడు నుంచి వనపర్తి పట్టణానికి అవుతున్న తాగునీటి సరఫరాతో ప్రజలకు తలెత్తుతున్న ఇబ్బందులను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా..

ఆయన స్పందించి ప్లాంట్‌ను మంజూరు చేశారని చెప్పారు. టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని మిషన్‌ భగీరథ అధికారులను ఆయన ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద భూ సేకరణకు సంబంధించిన పనులు వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సహకార శాఖ కార్యకలాపాలపై సహకార శాఖ అధికారి, డీసీసీబీ, ఇతర అధికారులు, వ్యవసాయ శా ఖాధికారులతో కలిసి కలెక్టర్‌ నేరుగా సమీక్షలు నిర్వహించాలన్నారు. రై తుబంధు పథకానికి సం బంధించి జూన్‌ 16 వర కు పట్టా పాస్‌పుస్తకాలు పొందిన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందే లా చర్యలు తీసుకోవాలన్నారు. 

మున్సిపాలిటీల పరిధిలో ప్రతి 10 వేల మందికి ఒక కమ్యూనిటీ టాయిలెట్‌ ఏర్పాటు చేసి ఆగస్ట్‌ 15 నాటిని అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను మంత్రి ఆదేశించారు. బల్దియాల్లో 100 శాతం పన్నులు వసూలయ్యేలా చర్యలు చేపట్టాలని, గృహాలకు, వ్యాపార సముదాయాలకు ఒకే రకం పన్ను లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 25 నుంచి ప్రారంభంకానున్న హరితహారాన్ని పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. జిల్లా అటవీ శాఖాధికారులు హెర్బల్‌ మొక్కలను నాటేలా చర్యలు చేపట్టాలన్నారు.  మున్సిపాలిటీల వారీగా సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషాను ఆదేశించారు.

పెబ్బేరు మున్సిపాలిటీలో సంత నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. వనపర్తి మున్సిపాలిటీలో 3 డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించాలన్నారు. పట్టణంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఈఈని ఆదేశించారు. ఈవీఎం గోదాం వద్ద సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి వెంటనే టెండర్లు ఆహ్వానించాలన్నారు. ఉపాధి పనుల కింద జూరాల, నెట్టెంపాడు, భీమా  కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించాలని డీఆర్‌డీవో అధికారులకు సూచించారు.  2,340 ఇండ్లకుగానూ నిర్మాణం కాని 1005 ఇండ్ల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. అంతకుముందు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను కలెక్టర్‌ యాస్మిన్‌ బాషతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, డీఎస్పీ కిరణ్‌, జిల్లా అధికారులు, మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు, వైస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.