మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 24, 2020 , 03:10:59

సీఎం పర్యటన నాటికి గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా శుభ్రంగా కనిపించాలి

సీఎం పర్యటన నాటికి  గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా శుభ్రంగా కనిపించాలి

  • డీపీవో, డీఆర్‌డీవోలకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశం 

  వనపర్తి, నమస్తే తెలంగాణ : ‘కంపతార చెట్టుకొట్టి కడుపునింపే కాలమొచ్చే’.. అంటూ ప్రముఖ కవి గోరటి వెంకన్న రాసిన పాటను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో కరువు తాండవిస్తున్న సమయంలో పనులు లేక పేద ప్రజలు కంపతార చెట్లు కొట్టుకొని వాటిని అమ్ముకొని పొట్ట నింపుకునే వారని.. ఆ నాటి పాలమూరు పరిస్థితులను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పాడి పశువులతో సస్యశ్యామలంగా ఆవిర్భవిస్తున్న సమయంలో ఎందుకు పనికి రాని ఈ కంపతార చెట్లని పూర్తిగా తొలగించాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు.

మంగళవారం వనపర్తి కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో డీపీవో, డీఆర్‌డీవో, మున్సిపల్‌ కమిషనర్లతో ఆయన మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారని, అప్పటివరకు అన్ని గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా కనిపించాలన్నారు. 25 నుంచి ప్రారంభమయ్యే హరితహారంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో నాటిన మొక్కలు ఎదిగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ మొక్కలు పెరిగేందుకు ఆటంకంగా ఉన్న కంపతారు చెట్లు, పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగించాలని సూచించారు. ఏపుగా పెరిగిన ఈ చెట్లను తొలిగించే కార్యక్రమాన్ని చాలెంజ్‌గా స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఉపాధి కింద పనులు చేపట్టి వాటిని తొలగించాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు పెరిగేందుకు సర్పంచులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.