సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Jun 24, 2020 , 03:03:40

లాక్‌డౌన్‌లో ప్రజల ఆకలితీర్చిన ప్రభుత్వం

లాక్‌డౌన్‌లో ప్రజల ఆకలితీర్చిన ప్రభుత్వం

  • పేదలకు  ఉచితంగా  1,19,87,224  మెట్రిక్‌ టన్నుల బియ్యం
  • రూ.41,21,79,000 నగదు అందజేత
  • వనపర్తి జిల్లాలో 1,54,165 రేషన్‌ కార్డులు
  • ఉచిత బియ్యం తీసుకున్న 1,37,437 కార్డుదారులు
  • రూ. 1500 సాయం అందుకున్న 1,37,406మంది

వనపర్తి, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ విధించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతి వ్యక్తికి 12కిలోల బియ్యం, కార్డుకు రూ.1500 చొప్పున చెల్లించి ఆదుకున్నది. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని వనపర్తి జిల్లాలో 1,54,165 రేషన్‌ కార్డుదారులుండగా వీరిలో 1,37,437మంది వినియోగించుకున్నారు.

ఏప్రిల్‌, మే నెలలో ప్రభుత్వం జిల్లాలో ఉచితంగా 1,19,87,224 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని, రూ.1500 సహాయాన్ని 1,37,406 మందికి రూ. 41,21,79,000లను అందజేసింది. లాక్‌డౌన్‌ సమయంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఉద్యోగులకు సగం వేతనాలు, వ్యాపార సముదాయాలు బంద్‌ చేయడంతో వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయారు. ఈ సమయంలో పేద, కూలీల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్‌ ప్రతి వ్యక్తికి అందించే బియ్యానికి రెట్టింపుగా లాక్‌డౌన్‌ సమయంలో అందించారు. కష్టకాలంలో పేదలు ఆకలితో అలమటించకుండా ప్రభుత్వం నిర్ణయంతో ఎంతోమంది పేదలు లబ్ధి పొందారు.   

1,54,165 రేషన్‌కార్డులు

వనపర్తి జిల్లాలో పౌరసరఫరాల శాఖ ద్వారా మొత్తం 1,54,165 రేషన్‌ కార్డులను ప్రజలకు అందజేశారు. వీటిలో అంత్యోదయ కార్డులు 9,465, ఆహార భద్రత కార్డులు 1,44,169, అన్నపూర్ణ కార్డులున్నాయి. వీరిలో లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వం రెండు నెలలపాటు అందించిన ఉచిత బియ్యాన్ని 1,37,437 కార్డుదారులు అందుకున్నారు.

ప్రతి కార్డుకు అందించిన రూ.1500 సాయాన్ని 1,37,406 మంది తీసుకున్నారు. వీరిలో 7,262 మంది లబ్ధిదారులు పోస్టాఫీసుల ద్వారా ప్రభుత్వం అందించిన నగదును పొందగా 1,30,144 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేసింది. ఆధార్‌ కార్డులు జత చేయకపోవడం, ఏప్రిల్‌, మే నెలలో 15వ తేదీ తర్వాత రేషన్‌ బియ్యం పొందడం వల్ల జిల్లాలో 9,465 మంది ప్రభుత్వం అందించిన నగదు సాయాన్ని అందుకోలేక పోయారు.

రెండు నెలల్లో ప్రతి వ్యక్తికి 12కిలోల చొప్పున 1,19,87,224 మెట్రిక్‌ టన్నులు పంపిణీ చేశారు. దీంతోపాటు రూ.41,24,79,000 నగదు సాయాన్ని ప్రభుత్వం కార్డుదారుల ఖాతాల్లో జమచేశారు. 

అత్యధికంగా వనపర్తిలోనే..

రేషన్‌కార్డుల లెక్క ప్రకారం జిల్లాలోని వనపర్తి మండలంలో 27,210 రేషన్‌ కార్డుదారులున్నారు. దీంతో అత్యధికంగా 23,029 రేషన్‌ కార్డుదారులకు రూ.3,45,43,500లను వారి ఖాతాల్లో జమచేసింది. వీరిలో పోస్టాఫీసుల ద్వారా 1294 మందికి నగదు సాయం జమచేశారు. శ్రీరంగాపూర్‌ మండలంలో అత్యల్పంగా 5,235 రేషన్‌కార్డులు ఉండటంతో జిల్లాలో అతి తక్కువ నగదు పంపిణీ జరిగింది. 4,853 రేషన్‌ కార్డు దారులకు రూ.72,79,500 నగదు సాయాన్ని పొందారు. వీరిలో పోస్టాఫీసుల ద్వారా 146 మంది లబ్ధిదారులు నగదు సహాయాన్ని పొందారు.  

89శాతం పంపిణీ చేశాం

ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సాధారణ సమయంలో 70 నుంచి 80శాతం రేషన్‌ సరుకులు పొందుతారు. లాక్‌డౌన్‌ సమయంలో ఉచితంగా ప్రతి వ్యక్తికి 12కిలోల బియ్యం అందించడం, రేషన్‌ కార్డు దారులకు రూ.1500 పంపిణీ శాతం పెరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్‌ నెలలో 86.99శాతం, మే నెలలో 89.15 శాతం రేషన్‌ సరుకుల పంపిణీ జరిగింది.   

     - రేవతి, పౌర సరఫరాల శాఖ అధికారి, వనపర్తి జిల్లా