శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 02:16:59

విశిష్ట మాసం ఆషాఢం

విశిష్ట మాసం ఆషాఢం

  • నేటి నుంచి శూన్యమాసం ప్రారంభం
  • హైందవ సంస్కృతిలో ప్రాముఖ్యం
  • శుభకార్యాలకు నెల రోజుల విరామం

పెబ్బేరు రూరల్‌ : శాస్త్రసాంకేతిక రంగాల్లో మనం ఎంతగా పురోగమనం సాధించినప్పటికీ కొన్ని సంప్రదాయాలకు అతీతులం కాలేకపోతున్నాం. అవి మన జీవనంలో ముడిపడిపోయాయని చెప్పొచ్చు.  ము ఖ్యంగా హైందవ మతం సంస్కృతీ సంప్రదాయలకు పెట్టింది పేరు. ఏడాది పొడవునా ఎన్నో పర్వదినాలను, వ్రతాలను, పూజలను ఆచరిస్తున్నప్పటికీ కొన్ని మాసాలు మాత్రం విశిష్టతను, ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. శ్రావణం, కార్తీక మాసాలతోపాటు ఆషాఢమాసం కూడా ఒకటి. ఈ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జూన్‌ 22 నుంచి జూలై 20వ తేదీ అమావాస్య వరకు ఈ మాసం కొనసాగుతుంది. 

శూన్యమాసంగా పేరు

  ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. అందుకే ఈ నెలలో వివాహాది శుభకార్యాలేవి చేయరు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం పెండిడ్లు చేస్తుంటారు. చాలా మంది ఈ మాసాన్ని ఇష్టపడరు. ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టరు. అంతా ఆషాఢం పోయాకే అని అంటుంటారు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైనది. తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఇక్కడి నుంచి ప్రతి వారానికి, ప్రతి పదిహేను రోజులకోసారైనా ఏదో ఒక పండుగ కానీ, వ్రతం, పూజలు కానీ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఈ మాసంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు సూచిస్తుంటారు. 

బోనాల పండుగకు ప్రత్యేకత

 ఈ మాసంలోనే బోనాల పండుగలు ప్రారంభమవుతాయి. తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా బోనం నివేదన తీసుకెళ్లి అర్పించేది ఈ నెలలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన జగన్నాథుడి రథయాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలుగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ జగజ్జననీ, సకల జీవులకు ఆహారం అందించే శాకాంబరీదేవిగా  దర్శనమిచ్చేది ఈ నెలలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా నిర్వహిస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్తమాతృకలు, మహిషాసురమర్ధిని, దుర్గాదేవిని, భైరవ, వరహా, నారసింహుల ఆరాధన తప్పక చేయాలి. 

కొత్త జంటలకు విరామమిచ్చే మాసం

  కొత్తగా పళ్లైన వధువును పుట్టింటికి తీసుకెళ్లేది ఈ మాసంలోనే. ఈ మాసం ఎప్పుడొస్తుందా.. అన్నట్లు కొత్త పెళ్లి కూతుర్లతో పాటు వారు కుటుంబీకులు ఎదురుచూస్తుంటారు. కొత్త దంపతులను దూరంగా ఉంచడం పూర్వం నుంచి వస్తోంది. అలాగే తొలకరి వర్షాలు కూడా ప్రారంభమవుతాయి. అన్నదాతలకు అనుకూలమైన నెల. పూర్తిగా వ్యవసాయ పనుల్లోనే నిమగ్నమవుతారు. కుటుంబమంతా పొలం పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటంతో కొత్త కోడలిని పుట్టింటికి పంపిస్తారు. 

అత్తాకోడళ్లు ఒకే గడప తొక్కరు

 ఈ మాసంలో కొత్తగా వివాహామైన ఇంట్లో అత్తాకోడళ్లు ఒకే కడప తొక్కరాదనే ఆచారం అనాధిగా వస్తోంది. ఎన్ని తరాలు మారినా ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుండటం విశేషం. దీనికి ఎన్నో రకాల విశ్లేషణలు ఉన్నప్పటికీ, అందరి శ్రేయస్సు కోరే ఈ నిబంధన విధించి ఉంటారన్నది నగ్నసత్యం. శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు. శాస్త్రీయ కారణాల వల్ల శూన్యమాసంగా పెద్దలు నిర్ణయించారు. వ్యాపారాలకు కూడా ఈ నెల అచ్చిరానిదే. అందుకే పెద్దపెద్ద సంస్థలు డిస్కౌంట్ల పేరుతో జనాన్ని ఆకర్శించే ప్రయత్నం చేస్తుంటారు.

- లక్ష్మీకాంతాచార్యులు, వేదపండితుడు,

 పెబ్బేరు, వనపర్తి జిల్లా