ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 02:10:25

జయశంకర్‌ సార్‌ ఆశయాలు కొనసాగిద్దాం

జయశంకర్‌ సార్‌ ఆశయాలు కొనసాగిద్దాం

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల: ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ఆశయాలు అంద రూ కొనసాగించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం జయశంకర్‌సార్‌ వర్థంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పుట్టుక నీది చావు నీది నడుమ జీవితమంతా తెలంగాణది ఈ నినాదాన్ని ఆచరించిన వ్యక్తి జయశంకర్‌సార్‌ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ పోరాటమే కాకుండా రాజకీయ ప్రక్రియ కూడా అవసరమని ప్రస్తుత సీఎం కేసీఆర్‌కు ఉద్యమ సమయంలో మార్గనిర్ధేశం చేసిన మహనీయిడని చెప్పారు. చదువుకునే రోజుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించిన ధీరోదాత్తుడన్నారు. 1969లో జరిగిన తెలంగాణ పోరాటంలో పాల్గొనడమే కాకుండా తన 50 ఏళ్ల పోరాట కాలంలో మూడు దశల తెలంగాణ పోరాటాలకు ప్రత్యక్ష సాక్షి జయశంకర్‌ సార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి తెలంగాణలోనే కాకుండా దేశ,విదేశాల్లో సైతం ఎన్నో ప్రసంగాలు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన శక్తి వంతుడన్నారు. తెలంగాణ కోసం ఆస్తులనే కాకుండా తన వ్యక్తి గత ఆనందాలను,సుఖాలను త్యాగం చేసిన మహనీయుడని అలాంటి వ్యక్తి అడుగు జాడల్లో అందరం నడుద్దామన్నారు.  కార్యక్రమంలో నేతలు యమునప్పగౌడ్‌ పాల్గొన్నారు. అలాగే  జిల్లా కేంద్రంలో జనసమి తి  కార్యాలయంలో తెలంగాణ జనసమితి నాయకులు ఆలూరి ప్రకాష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూ లమాలవేసి ఘనంగా నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు మధుసూదన్‌గౌడ్‌, తిమ్మప్పగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే జయశంకర్‌సార్‌ యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్‌ఫోర్స్‌ అధ్యక్షుడు శివకుమార్‌, కార్యదర్శి నరేశ్‌ ఆచారి మాట్లాడుతూ భావితరాలకు సార్‌ పోరాటమే స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్యచారి, రాజేష్‌, తిరుమల్‌, లోకేష్‌, రాఘవ, రఘు కల్యాణ్‌చారి పాల్గొన్నారు.

జయశంకర్‌ సార్‌కు నివాళి

అయిజ : తెలంగాణ జాతిపిత, ఆచార్య జయశంకర్‌ సార్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. ఆదివారం పట్టణంలోని ఎంఆర్‌సీ కార్యాలయం ఆవరణలో జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ పోరులో జయశంకర్‌ సార్‌ పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర సాధనే లక్ష్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా ప్రణాళికలు రచించిన గొప్ప మహనీయుడు జయశంకర్‌ సారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ, ఏబీవీపీ నాయకులు మునిస్వామి, వీరశ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.