మంగళవారం 01 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 02:07:38

‘ఇన్నోవేషన్‌' ఇన్‌స్పైర్‌

‘ఇన్నోవేషన్‌' ఇన్‌స్పైర్‌

 • చిట్టి ఆలోచనలకు పదును
 • ఇన్‌స్పైర్‌ మనక్‌ విజ్ఞాన మేళాకు దరఖాస్తుల ఆహ్వానం
 • జూలై 31 వరకు గడువు
 • రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం

కందనూలు : చిట్టిబుర్రలో మెలిగే ప్రతి ఆలోచనను వెలికితీసినప్పుడే అనుభూతి, ఆ ప్రయోగానికి పడ్డ కష్టం విలువ తెలుస్తుంది. అలాంటి ఆవిష్కరణలు రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా ప్రతి ఏటా ‘ఇన్‌స్పైర్‌ మనక్‌' పేరిట విజ్ఞానమేళాను నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు బాలశాస్త్రావేత్తలుగా నామకరణం చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు. విజ్ఞానమేళాను ఫిబ్రవరి నెలలో నిర్వహించాల్సి ఉన్నది. కాగా, కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

దరఖాస్తు చేసుకునే విధానం..

 • ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌ మేళాలో పాల్గొనేందుకు ముందుగా www.inspireawards-dst.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి
 • స్కూల్‌ అథార్టీ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి.
 • అందులో న్యూ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ను ఎంపిక చేయాలి.
 • పాఠశాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచి సేవ్‌ చేయాలి. 
 • సంబంధిత దరఖాస్తు జిల్లా అథార్టీకి చేరుతుంది. 
 • ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మెయిల్‌ ఐడీకి యూజర్‌ ఐడీతో కూడిన లింక్‌ వస్తుంది. 
 • ఆ ఐడీతో పాస్‌వర్డు క్రియేట్‌ చేయాలి. 
 • అనంతరం విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి. 
 • సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు ప్రదర్శించాలి. 
 • జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు (ప్రతి స్కూల్‌ నుంచి ఐదుగురు) పాల్గొనే అవకాశం ఉంటుంది.
 • జూలై 31వ తేదీ లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలి. 

విద్యార్థి ఖాతాలోనే నగదు జమ..

విద్యార్థులు వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాలను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ప్రతినిధులు పరిశీలించి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన వారికి రూ.40వేలు, జాతీయ స్థాయికి ఎంపికైన వారికి రూ.60వేలు నగదును విద్యార్థుల ఖాతాలో జమచేస్తారు. దీంతో పాటు సంబంధిత పరిశోధనపై పేటెంట్‌ హక్కులు కల్పిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు.

జిజ్ఞాసను వెలికితీసేందుకే..

విద్యార్థులో ఉండే జిజ్ఞాసను వెలికితీసేందుకు ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లక్ష్యాలను చేరుకోవాలి. సందేహాలుంటే డీఈవో కార్యాలయంలో సంప్రదిం చాలి. దరఖాస్తు చేసుకునేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉన్నది. 

- గోవిందరాజులు, డీఈవో, నాగర్‌కర్నూల్‌