బుధవారం 02 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 22, 2020 , 01:59:39

చేనేతకు చేయూత

చేనేతకు చేయూత

గడువుకు ముందుగానే ‘త్రిఫ్ట్‌' పథకం నగదు విడుదల

  • మంత్రి కేటీఆర్‌ నిర్ణయంతో పొదుపు లబ్ధిదారులకు ఊరట
  • ఉమ్మడి జిల్లాలో 5,200 మంది చేనేత కార్మికులకు లబ్ధి
  • జీవో విడుదల చేసిన  రాష్ట్ర ప్రభుత్వం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. పొదుపు పథకంలో చేరిన నేతన్నలకు గడవుకు ముందే నగదు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. కార్మికుల జీతం నుంచి 8శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం 16శాతం జమచేస్తున్నది. ఆ మొత్తాన్ని మూడేండ్ల తర్వాత పొదుపుదారుడు తీసుకునే అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నేతన్నలను ఆదుకునేందుకు గడువుకు ముందే నగదు అందజేయనున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,200 మందికి లబ్ధి చేకూరనున్నది. రూ.12కోట్లు ఖాతాలో జమ కానుండడంతో చేనేత కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

- అయిజ

అయిజ : కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సర్కారు అండగా నిలుస్తున్నది. త్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీం(టీఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌)లో చేరిన కార్మికులకు గడువుకు ముందే నగదు అందించేందుకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని 5,200 మందికి దాదాపు రూ. 12కోట్లు విడుదల కానుండటంతో చేనేత కార్మికుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. చేనేత మగ్గంపై జీవనోపాధి పొందుతున్న చేనేత కార్మికులకు చేయూతనిచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చేనేత కార్మికులకు త్రిఫ్ట్‌ (పొదుపు) పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికుడు నెలకు 8శాతం రూ. 1200 పొదుపు చేస్తే, అందుకు ప్రభుత్వం 16శాతం రూ. 2400 జమచేస్తుంది. ఆ మొత్తాన్ని మూడేండ్ల తర్వాత సదరు పొదుపుదారుడు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ పొదుపు పథకానికి 2017లో ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, ఈ ఏడాది జూలైతో ముగియనున్నది. 

లబ్ధి చేయాలనే లక్ష్యంతో..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేనేత మగ్గాలు, మర మగ్గాలు దాదాపు పూర్తిగా మూగబోయాయి. దీంతో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. నెల క్రితమే సడలింపులు ఇవ్వడంతో మగ్గాలు నడిపిస్తున్నారు. నేతన్న కుటుంబాలను ఆదుకునేందుకు త్రిఫ్ట్‌ పథకం కింద జమ చేసిన డబ్బును తీసుకునేందుకు మరో రెండు నెలలు గడువున్నా.. వాటిని ముందే చెల్లిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్‌ గత నెల 23న ప్రకటించారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ శుక్రవారం జీవో విడుదల చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 5,200 మంది చేనేత కార్మికులకు రూ. 12 కోట్లు విడుదల కానున్నాయని అధికారులు చెబుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 5,200 మందికి..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో త్రిఫ్ట్‌ పథకంలో 5,200 మంది చేనేత కార్మికులు చేరారు. ప్రతి నెలా 8శాతం రూ. 1200 నగదును త్రిఫ్టులో జమ చేస్తున్నారు. వీటికి ప్రభుత్వం 16శాతం అంటే రూ. 2400 జమ చేస్తున్నది. త్రిఫ్ట్‌లో రెగ్యులర్‌గా నగదు చెల్లించిన కార్మికులకు రూ. 90వేల వరకు వచ్చే అవకాశం ఉన్నదని చేనేతశాఖ అధికారులు చెబుతున్నారు. గడువు ముగియకుండగానే త్రిఫ్ట్‌ నగదు జమ అవుతుండటంతో చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా గద్వాలలో.., అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చేనేత కార్మికులు ఉన్నారు. 

మార్గదర్శకాలు రాగానే అందజేస్తాం

త్రిఫ్ట్‌ పథకంలో చేరిన చేనేత కార్మికులకు నగదు అందించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కార్మికులకు ప్రభుత్వం గడువు ముగియకుండానే త్రిఫ్ట్‌ పథకం నగదును అందించాలని నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన జీవో విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,200 మందికి లబ్ధి చేకూరనున్నది. మార్గదర్శకాలు రాగానే అందుకనుగుణంగా నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

- చరణ్‌, ఏడీ, చేనేత జౌళీ శాఖ, జోగుళాంబ గద్వాల