సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Jun 15, 2020 , 02:29:07

కరోనా.. డోంట్‌ కేర్‌ అంటున్న ప్రజలు

కరోనా.. డోంట్‌ కేర్‌ అంటున్న ప్రజలు

వనపర్తి : కరోనా వైరస్‌ రోజు రోజుకూ రాష్ట్రంలో విస్తరిస్తూ నే ఉంది. ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. స్వీయ జాగ్రత్తలే కరోనా వైరస్‌ కట్టడికి శ్రీరామ రక్ష అని ప్రభుత్వాలు, అధికారులు, వైద్యులు హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం పెడచెవిన పెడుతూ కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో అతాలకుతలం కావడంతో తిరిగి గాడిలోకి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాస్త సడలింపులు ఇచ్చాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు ఉన్న భయం ప్రస్తుతం కనిపించగా పోగా కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరును చూసి వైద్యులు, అధికారులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్‌ జిల్లాగా ఉన్న వనపర్తి జిల్లాలో కూడా ఇటీవల ఒక పాజిటివ్‌ కేసు నమోదు కావడం ప్రజలు అవలంభిస్తున్న నిర్లక్ష్యానికి నిలువుటద్దాంగా మారింది. 

కరోనాపై అవగాహన మరిచి.. 

లాక్‌డౌన్‌ తర్వాత రోజువారీ పనులు, వ్యాపారులకు అవకాశం రావడంతో జిల్లాలో పలుచోట్ల సందడి నెలకొంది. పను లు చేసే ప్రాంతాలు, ప్రధాన చౌరస్తాల వద్ద, క్రయ విక్రయాల వద్ద, ఇతర వ్యాపార సముదాయాల వద్ద కరోనా వైరస్‌ కట్టడికి సంబంధించి కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. భౌతికదూరాన్ని పాటించాలని అధికారులు సూచించినప్పటికీ అది పాటించాలా మనకు ఏమీ కాదు అన్న అవగాహన రహితంగా ప్రజలు తమ పనిని చేసుకుంటూ పోతున్నారు. 

జరిమానాలు వేసినా ఫలితం శూన్యం

ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, క్రయ విక్రయాల వద్ద, వ్యాపార సముదాయాల వద్ద భౌతికదూరం పాటించకపోతే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించినా జరిమానాలు వేసినా ప్రజలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. భౌతికదూరం పాటించని దుకాణా యజమానులు, మాస్కులు లేకుండా బయటకు వచ్చిన ప్రజల నుంచి వనపర్తి పట్టణంలోనే రూ.1.40లక్షల జరిమానా వసూలు చేశారంటే ఏ స్థాయిలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తున్నారో మనకే అర్థంమవుతుంది.

ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు

  • ముఖానికి మాస్కు తప్పనిసరిగా ధరించాలి. 
  • మనిషికి మనిషికి భౌతికదూరం విధిగా పాటించాలి.
  • ప్రతి అరగంటకు ఒక సారి సబ్బుతో మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి. 
  • గుంపులుగుంపులుగా ఉన్న ప్రదేశాలలో సంచరించరాదు. 
  • అత్యవసరమైతేనే తప్పా ఎవరూ బయటికి రావద్దు.

ప్రజలు విస్మరించిన జాగ్రత్తలు

  • మాస్కులను ధరించకుండా పనులు చేసుకోవడం
  • భౌతికదూరాన్ని పాటించడం లేదు.
  • ఆటోలు, ట్యాక్సీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలించడం.
  • శానిటేషన్స్‌ వాడటం లేదు.
  • గుంపుగుంపులుగా తిరగడం, పార్టీలు చేసుకోవడం