శనివారం 28 నవంబర్ 2020
Wanaparthy - Jun 15, 2020 , 02:17:02

చేయి చేయి కలుపుదాం.. ప్లాస్టిక్‌ను తరిమేద్దాం

చేయి చేయి కలుపుదాం.. ప్లాస్టిక్‌ను తరిమేద్దాం

వనపర్తి : పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్లాస్టిక్‌ను ప్రజలు అవసరానికి మించి విచ్చలవిడిగా.. అవగాహన రహితంగా వాడకంతో అది కాస్త పెనుభూతంలా మారి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ సమస్త జీవకోటికి ముప్పు వాటిళ్లుతున్నది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్‌ లేని స్థలం ఎక్కడ వెతికినా దొరకదు అంటే ఆశ్చర్యపోవాల్సిందే.. అంతలా కలిసిపోయిన ప్లాస్టిక్‌ మానవుడి మనుగడలో విస్తరిస్తూ చివరికి భూమి, జలచర జీవులను సైతం హతమార్చే పెనుభూతంలా మారి పర్యావరణాన్ని అతాలకుతలం చేస్తున్నది. నాటి మట్టి, రాగి, ఇతర లోహాలతో తయారు చేసిన వస్తువు స్థానంలో నేడు ప్లాస్టిక్‌ దర్శనమిస్తున్నది. ప్లాస్టిక్‌ నివారణ దిశగా పాత పద్ధతులను అవలంబిస్తే.. ఉదాహరణకు ఎక్కడికి వెళ్లినా చేతి సంచులు, గుడ్డ సంచులు, పేపర్‌ బ్యాగులు వంటివి వాడకంలోకిసుకుని వస్తే యథావిధిగా ప్లాస్టిక్‌ వాడకం తగ్గిపోయి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండవచ్చని అంటున్నారు.

ప్లాస్టిక్‌ నివారణకు మూడు పద్ధతులు

ప్లాస్టిక్‌ నివారణకు మూడు పద్ధతులున్నాయి. రెడ్యూస్‌, రీయూస్‌, రీసైక్లింగ్‌ ద్వారా పూర్తిస్థాయిలో నివారించవచ్చు. ఈ మూడు రకాల ప్లాస్టిక్‌ అత్యంత ప్రమాదకరమైనది రెడ్యూస్‌. రెడ్యూస్‌ అంటే ఒకేసారి వాడి పడేయడం(ప్లాస్టిక్‌ కవర్లు, టీ గ్లాసులు, ప్లేట్స్‌, గ్లాసులు, రోజువారికి ఉపయోగించే ప్లాస్టిక్‌), రెండోది రీయూస్‌ అంటే ఒకే ప్లాస్టిక్‌ను పలు రకాలుగా వాడటం. వీటిని నాణ్యవంతంగా తయారు చేయడం వల్ల పర్యావరణానికి, ప్రజలకు ఎటువంటి హానీ కలుగదు. వీటిని పలుమార్లు వాడుకోవచ్చు. మూడోది రీసైక్లింగ్‌.. వీటివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వీటి వాడకం తర్వాత పడేసిన వాటిని తిరిగి రీసైక్లింగ్‌ చేయడం వల్ల నూతన ప్లాస్టిక్‌ తయారుకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా రీయూస్‌, రీసైక్లింగ్‌ అయ్యేటటువంటి ప్లాస్టిక్‌ను వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

ప్లాస్టిక్‌ వల్ల కలిగే నష్టాలు

  • ఏ పదార్ధాలకు ఎటువంటి ప్లాస్టిక్‌వాడాలో అవగాహన లేకపోవడం.
  • ఆహార పదార్థ్ధాలకు కవర్లు ఉపయోగించడం వల్ల సెకన్లలో వాటి రియాక్షన్‌ కనబడుతున్నది. 
  • ప్లాస్టిక్‌ను తగులబెట్టడం వల్ల కాలుష్య కారక వాయువులు వెలువడుతాయి. 
  • మానవుడికి ప్రధానంగా క్యానర్స్‌, గుండె జబ్బులు, జీర్ణాశయం, ప్రేగు వ్యాధులు, ఊపిరితిత్తులు, నరాల బలహీనత వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
  • ప్లాస్టిక్‌ వాడకం వల్ల భూమి సారం తగ్గడం, భూమిలో ఉన్న మృతికలలో ఉండే వివిధ రకాలైన పర్యావరణానికి ఉపయోగపడే జీవన చక్రంపై ప్రభావం చూపి నేలల సారవంతాన్ని తగ్గిస్తాయి. 
  • భూమి ఉపరితలంలో, పై పొరలలో విపరీతంగా పేరుకుపోయిన ప్లాస్టిక్‌ పొరగా ఏర్పడి భూగర్భజలాల లభ్యత ( ఉత్పన్నం) మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
  • ప్లాస్టిక్‌ను పట్టణ డ్రైనేజీల మురుగు కాల్వల్లో పడేయడం వల్ల అది పేరుకుపోయి వరదలకు కారణమవుతుంది. 
  • పట్టణాలలో ఉండే ప్రజలు ఆహారపదార్థాలు ప్లాస్టిక్‌ కవర్లో కట్టి పడేయడంతో పశువులు ప్లాస్టిక్‌ కవర్లతో కలిసి తినడం వల్ల ప్లాస్టిక్‌ కవర్లు జీర్ణాశయంలో పేరుకుపోయి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. 
  • చెరువులు, కుంటలు, నదులలో ప్లాస్టిక్‌ కవర్లు పడేయడం వల్ల జలచర జీవులు వంటివి వాటి మూతికి అడ్డుతగిలి తీసుకోవడానికి రాకపోవడంతో చనిపోయే అవకాశాలు ఉంటాయి. 
  • ఆకాశంలో ఎగిరే పక్షులకు నాసిరకం ప్లాస్టిక్‌, మాంజాలు తగిలి చనిపోయే ప్రమాదాలు ఉన్నాయి. 

ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన

స్వచ్ఛ వనపర్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో గతేడాది ఆగష్టు 3న జిల్లాలోని 255మంది సర్పంచులు, జిల్లా, మండల అధికారులకు అప్పటి కలెక్టర్‌ శ్వేతామొహంతి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి ప్లాస్టిక్‌ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్‌ విషపూరితమైనదని, దీనివల్ల సముద్రాలు సైతం కలుషితం అయిపోతున్నాయని, భవిష్యత్‌ తరాలు ఆరోగ్యంగా జీవించేందుకు ప్లాస్టిక్‌ నిరోధించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. గ్రామాలలో ప్లాస్టిక్‌కు బదులుగా కాగితపు సంచులు, బట్ట సంచులు వాడాలని, కిచెన్‌ కంపోస్టు పిట్‌ వాడాలని, పాఠశాలల్లో కంపోస్టు తయారు చేయాలన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు, బ్యాగుల డి కంపోస్టు చేసేందుకు చాలా ఏండ్లు పడుతుందని, పేపర్‌ బ్యాగులు వాడాలని కలెక్టర్‌ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. 

నివారణ దిశగా సాగుతున్నాం 

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ నివారణ దిశగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే పలుమార్లు దుకాణా సముదాయాల యజమానులతో ప్లాస్టిక్‌ నిర్మూళన దిశగా చర్యలను తీసుకుంటున్నాం. ఒకసారి వాడే ప్లాస్టిక్‌పై ప్రత్యేక శ్రద్ద తీసుకుని వాటిని ఏ దుకాణాల యజమానులు విక్రయించిన, వాడినా వారిపై చట్టరీత్యా చర్యలను తీసుకుంటున్నాం. - మహేశ్వర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి