శుక్రవారం 04 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 15, 2020 , 02:00:59

ఇక్కడి పల్లీల్లో పోషకాలు ఎక్కువ

ఇక్కడి పల్లీల్లో పోషకాలు ఎక్కువ

పెద్దమందడి: వనపర్తి జిల్లా పరిసర ప్రాంతాల్లో పండే వేరుశనగలో పోషకాలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడి నుంచే మేలు రకాలైన విత్తనోత్పత్తి చేసేందుకు పరిశోధన కేంద్రం ఉపయోగపడుతుందని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లా పరిసర ప్రాంతాలలో పండించే వేరుశనగ విత్తనాలలో నూనె శాతం అధికంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వీరాయపల్లిలో పర్యటించినట్లు తెలిపారు. జాతీయస్థాయి వేరుశనగ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు గ్రామంలోని 141 సర్వే నంబర్‌లోగల 24ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంపీపీ మెగారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాశ్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పండే వేరుశనగలో నూనె ఉండే పోషకాలు ఎక్కువగా ఉన్నాయని, శ్రేష్టమైన బుడ్డలను పండించేందుకు ఇంకా రైతులకు అధిక లాభాలు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ జాతీయస్థాయి వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ప్రతిపాదిత స్థలంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలను ఆదేశించారు. వేరుశనగ పరిశోధన కేంద్రం ఉండడంతో రైతులు పంటపై ఎక్కువ దృష్టి సారిస్తారని, ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. అనంతరం గ్రామ రైతులతో మాట్లాడుతూ సాగు వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జయశంకర్‌ విశ్వవిద్యాలయ సంచాలకులు డాక్టర్‌ ఆర్‌ జగదీశ్వర్‌, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్‌ అవిల్‌కుమార్‌, శాస్త్రవేత్తలు సదయ్య, ఏఈవో యుగంధర్‌ ఉన్నారు.