మంగళవారం 24 నవంబర్ 2020
Wanaparthy - Jun 14, 2020 , 02:35:15

విత్తనాల శుద్ధితో.. తెగుళ్ల నివారణకు పరిష్కారం

విత్తనాల శుద్ధితో.. తెగుళ్ల నివారణకు పరిష్కారం

వనపర్తి రూరల్‌ : రైతులు వానకాలం సాగు కోసం సన్నద్ధం అవుతున్నారు. దుక్కులు, దున్నుకుంటూ, నారుమళ్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. వానకాలం సాగులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకునే పనిలో ఉండగా, గత వానకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వ్యవసాయశాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ముఖ్యంగా రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ వాటిని తప్పక శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలకు నేల నుంచి సంక్రమించే తెగుళ్ల నుంచి కాపాడేందుకు తప్పనిసరిగా రైతులు విత్తనశుద్ధి చేయాల్సిందేనని వ్యవసాయ శాఖ సూచిస్తున్నది.

విత్తన శుద్ధితో ప్రయోజనాలు

 • విత్తనాల ద్వారా లేదా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల పురుగులను సమర్థవంతంగా నివారించడానికి దోహదపడుతుంది.
 •  శుద్ధికి వినియోగించే ముందు విత్తనంలోకి చొచ్చుకొనిపోయి శిలీంద్ర బీజాలను నాశనం చేస్తాయి. 
 • పప్పు జాతి పంట మొక్కల వేర్లపై, వేరు బుడిపెలు సంఖ్య పెరుగుతుంది.
 • విత్తన శుద్ధి చేసిన తరువాత మొలకెత్తిన లేత మొక్కలు నేలలో ఉన్న శిలీంద్రాల నుంచి రక్షణ పొందుతాయి.
 • తక్కువ ఖర్చుతో పంటకు పురుగులు, తెగుళ్లు ఆశించకుండా చేయవచ్చు.

విత్తన శుద్ధి పూత పద్ధతులు

ఒక కిలో విత్తనానికి 2.5 గ్రాముల మాంకోజెట్‌ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ పద్ధతిలో విత్తనానికి ద్రవం రూపంలో, పొడి రూపంలో మందులను విత్తనానికి పట్టిస్తారు. ఈ పద్ధతిలో మందులు విత్తనానికి పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన జిగురు పదార్థాన్ని వాడతారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 •  విత్తన శుద్ధికి వాడే మందులు తగిన మోతాదులో వాడాలి. మోతాదుకు మించితే, విత్తనం మొలక శాతం దెబ్బతింటుంది. 
 • విత్తనాన్ని శిలీంద్ర నాశిని, పురుగు మందులతో విత్తన శుద్ధి చేసిన తరువాతనే జీవ రసాయనాలతో శుద్ధి చేయాలి.
 • శుద్ధి చేసేటప్పుడు గింజ పగలకుండా, లేదా గింజ పై తోలు లేచి పోకుండా చూసుకోవాలి.
 • శుద్ధి చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు వేసుకొని మూతికి గుడ్డ కట్టుకోవాలి.

వివిధ పంటలకు రసాయనాలు

 • మొక్కజొన్న, పెసర, మినుము, కందులు శుద్ధికి 3.0 గ్రాముల థైరామ్‌, కాప్టాన్‌, మాంకోజెట్‌
 • మిరప విత్తన శుద్ధికి టీఎస్‌ ఓపీ 150 గ్రాములు
 • వేరుశనగ శుద్ధికి క్లోరిపైరిపాస్‌ 0.6 మిల్లీ లీటర్లు