శనివారం 05 డిసెంబర్ 2020
Wanaparthy - Jun 14, 2020 , 02:13:41

రక్తం పంచాలంటే రవ్వంత మనసుంటే చాలు..

రక్తం పంచాలంటే రవ్వంత మనసుంటే చాలు..

ఒకరు చేసే రక్తదానం..ఆపద సమయంలో మరొకరికి ప్రాణదానం అవుతున్నది. మనం దానం చేసే కొంత రక్తమైనా వేరొకరికి నిండుప్రాణాన్ని నిలుపుతున్నది. ప్రమాదం జరిగినప్పుడు అవసరానికి రక్తం నిల్వ అందుబాటులో లేకపోతే  జరిగే ప్రమాదాన్ని ఊహించుకోవడం ఎంతో భయాందోళనకు గురి చేస్తున్నది. అందుకే రక్తం ప్రాధాన్యం గుర్తించి ప్రతి ఏటా రక్తదాతల దినోత్సవం ఏర్పాటు చేసుకున్నాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరం రక్తదానం చేద్దాం.. ప్రాణదాతలమవుదాం. - మహబూబ్‌నగర్‌ క్రైం/వనపర్తి

రక్తం పంచాలంటే రవ్వంత మనసుంటే చాలు.. ఎంతో మందికి ప్రాణం పోసినోళ్లమవుతాం.. అందులోని తృప్తి అనుభవించినోళ్లకు తప్ప ఇతరులకు అంతుపట్టదు. ఒక్కసారి రక్తమిచ్చి చూడండి.. ఆ సంతృప్తి ఏంటో తెలుస్తుంది. ఇలా.. పదుల సంఖ్యలో రక్తదానం చేసిన వారెందరో ఉన్నారు.. 30ఏండ్లుగా రక్తదానం చేసిన వారూ ఉన్నారు.. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. 

రక్తం ప్రాధాన్యత 

మనిషి శరీరంలో అవయవాలు పని చేయాలంటే రక్తం ప్రధానం. రక్త ప్రమేయం లేకుండా శరీరంలో ఏ భాగం పనిచేయదు. సాధారణంగా మనిషి శరీరంలో సుమారుగా 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక లీటర్‌ రక్తంలో నాలుగు నుంచి 11 మిలియన్ల తెల్లరక్త కణాలు, ఐదు మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. రక్తంలో 54శాతం ప్లాస్మా, 46శాతం సెల్స్‌ ఉంటాయి. 

రక్తదానం వీరు చేయొద్దు..

శ్వాసకోశ వ్యాధులున్నవారు, క్యాన్సర్‌, గుండె జబ్బులు, ఉన్నట్లుండి బరువు తగ్గడం, డయాబెటీస్‌, హైపటైటీస్‌, ఆస్తమా, ఏపిలెప్సి, లెప్రసీ, కాలేయ వ్యాధులు, ఎండోక్రైన్‌ సమస్యలు, హెచ్‌ఐవీ లక్షణాలు కలిగిన వారు రక్తదానం చేయొద్దు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత ఉన్నవారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్నవారు. ఈ విషయాన్ని వైద్యులకు తెలియజేస్తే వారు ఎప్పటిదాకా రక్తదానం చేయొద్దో చెబుతారు.
 • ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఏర్పడిందిలా..

  రక్తంలోని ఏ, బీ, ఓ గ్రూపులను కనుగొన్న కార్ల్‌సైనర్‌ 1868 జూన్‌ 14 వియన్నాలో జన్మించారు. ఆయన గౌరవార్థం ఈ రోజున రక్తదాతల దినంగా ప్రపంచం మొత్తం కొనసాగిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రెడ్‌క్రాస్‌ వంటి సంస్థలు ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అన్ని దానాల కన్నా రక్తదానం చాలా విలువైనదని మేధావులు సూచిస్తున్నారు. 

  రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

   రక్తదానం చేయాలంటే ..

   • రక్తదానం చేయడం వల్ల మరో వ్యక్తికి ప్రాణం పోయడంతోపాటు ఇతర శారీరక ప్రయోజనాలు ఉంటాయి. 
   • రక్తదానం చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. 
   • క్యానర్స్‌ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. 
   • శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తి పెరుగుదలకు దోహదం చేస్తుంది. 
   • శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. 
   • సహజంగా వచ్చే అనారోగ్యానికి దూరంగా ఉంచుతుంది.
   • రక్తదానం చేయడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. 
     • 18 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్సు ఉండి కనీస బరువు 45 కిలోలు ఉండాలి.
     • రక్తంలో కనీసం 12.5 గ్రాముల హిమోగ్లోబిన్‌ కలిగి ఉండాలి.
     • హెచ్‌ఐవీ, సిఫిలిస్‌, హైపటైటీస్‌, మలేరియా, క్యానర్స్‌, హై బీపీ, క్షయ వంటి వ్యాధులు లేకుండా ఉండాలి.

     వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేశాం

     రక్తదానం చేసి ప్రాణదాతలు కావడానికే బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌, వాట్సాప్‌ గ్రూప్‌ తయారు చేశాం. ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ వ్యవస్థాపకుడు పండిత్‌ రవిశంకర్‌ గురూజీ జన్మదినం సందర్భంగా పాలమూరు ఆర్ట్‌ ఆఫ్‌ లీవింగ్‌ బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ అడ్మిన్‌గా రక్తదానం చేస్తున్నారు. ఈ గ్రూపులో రక్తం అందుబాటులో లేని వారి కోసం రక్తదానం చేసేందుకు ఇప్పటి వరకు 50 మంది ముందుకొచ్చారు. ఈ గ్రూప్‌లో ప్రభుత్వ వైద్యాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత ఉన్నారు. వీరంతా స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు వాట్సాప్‌ గ్రూపులో జాయిన్‌ అయ్యారు. అత్యవసర వేళల్లో రక్తం లభించక నిత్యం అనేకమంది మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితి లేకుండా ఉండేందుకు మా వంతు సహాయం చేసేందుకు రక్తదాతల వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశాం. అత్యవసర సమయంలో బ్లడ్‌ కావాల్సిన వారికి మా గ్రూప్‌ సభ్యులు రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. - సంధ్యారాణి,  ఉపాధ్యాయురాలు, మహబూబ్‌నగర్‌

     ఇబ్బందులు చూశాను..

     ప్రభుత్వ దవాఖానలో రోడ్డు ప్రమాదంలో గాయాలుపాలై రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్న  వారిని కండ్లారా చూశాను. ఆపదలో ఉన్న వారికి ఏదైనా సాయం చేయాలనే ఆలోచనతో రక్తదానం చేయడాన్ని లక్ష్యంగా ఎంచుకున్నా. అప్పటి నుంచి గాంధీ జయంతి, నా పెండ్లి రోజు మార్చి 11న కచ్చితంగా రెడ్‌క్రాస్‌కు వెళ్లి రక్తదానం చేస్తాను. పదేండ్లుగా రక్తదానం చేస్తున్నాను. ఇప్పటివరకు 19సార్లు రక్తదానం చేశాను. - ఆనంద్‌, మహబూబ్‌నగర్‌ 

     ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి

     నేను ఇప్పటి వరకు 75సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం అనేది చాలా మంచి అలవాటు. ఆరోగ్యానికి ఎలాంటి హాని జరుగదు. అనారోగ్య సమస్యలు తలెత్తవు. 18 నుంచి 60 ఏండ్ల లోపు ఉన్న వారు రక్తదానం చేయొచ్చు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసినట్లయితే రక్త నిల్వలు పెరుగడంతోపాటు ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడుతుంది. -  పోచ రవీందర్‌రెడ్డి, రక్తదాత, వనపర్తి 

     రక్తదాతలు.. ప్రాణదాతలు 

     ఒక మనిషికి రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు నిలబెట్టినవారు అవుతారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి రక్తదానం చేయొచ్చు. అనవసరంగా చనిపోయే రక్తనాళాలను ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయటం వల్ల మరొకరికి ప్రాణదానం చేయవచ్చు. జనరల్‌ దవాఖానలో ప్రసవాలకు వచ్చే గర్భిణులకు రక్తం ఎంతో అవసరం. చాలా సందర్భాల్లో రక్తం అందుబాటులో లేక కొరత ఏర్పడుతున్నది. నా పుట్టిన రోజు, మా పిల్లల పుట్టినరోజు సంవత్సరంలో రెండు సార్లు రక్తదానం చేస్తాను.

     - డాక్టర్‌ రాంకిషన్‌, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ జనరల్‌ దవాఖాన, మహబూబ్‌నగర్‌ జిల్లా

     138 సార్లు రక్తదానం చేశాను

     నా రక్తం ‘బీ’ పాజిటివ్‌. నా సోదరి పెండ్లి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి మొదటిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి స్వచ్ఛందంగా 138సార్లు రక్తదానం చేశాను. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా 139వ సారి రక్తదానం చేస్తున్నాను. రక్తదానం చేసినందుకు జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయిలో అవార్డులు అందుకున్నాను. జిల్లాలో రక్తదానం చేసేందుకు యువత, స్వచ్ఛంద సంస్థలను చైతన్యం చేస్తున్నాం. ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నాం. 

     - లయన్‌ నటరాజ్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా

     మానవత్వం చాటాలి

     ఆపదలో ఉన్న సమయంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకోవాలి. రక్తదానం చేయడం వల్ల దాతలకు ఎలాంటి నష్టం జరుగదు. రక్తదాన శిబిరాల్లో యువకులు, రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. రక్తదానంపై పలు అవగాహన కార్యక్రమాలతోపాటు శిబిరాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. జిల్లా మీదుగా జాతీయ రహదారి ఉన్నందున చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతులు కావాలి. 

     - ఖాజాకుత్బుద్దీన్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌, వనపర్తి జిల్లా