ఆదివారం 29 నవంబర్ 2020
Wanaparthy - Jun 12, 2020 , 09:58:55

ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకోవచ్చు

 ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసుకోవచ్చు

    కేసు నమోదు చేయాలని ఏదైనా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. ఇది తమ పరిధిలో లేదు.. వేరే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని.. అక్కడికి వెళ్లాలని గతంలో సూచించేవారు. ఇకపై అలాంటి మాటలు పోలీస్‌స్టేషన్లలో ఎవరికీ వినపించదు. సంఘటన జరిగినప్పుడు బాధితుడు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ వెళ్లి ఫిర్యాదు చేసిన వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ ద్వారా కేసు నమోదు చేస్తున్నారు. - వనపర్తి

వనపర్తి  జిల్లాలో ఒక డివిజన్‌ కార్యాలయం, మూడు ( వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్‌ ) సర్కిల్‌ కార్యాలయాలతోపాటు 15 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఏర్పాటు చేసిన హద్దులు ఏయే పోలీస్‌స్టేషన్ల పరిధిలోకి వస్తాయో ఆ హద్దుల్లో ఏదైనా సంఘటనలు జరిగితే మరో పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే ఇది తమ పరిధిలోకి రాదు.. ఆ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లండి అని సమాధానాలు చెప్పేవారు. ఇక నుంచి ఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేసే విధం గా ప్రభుత్వం ఆదేశించింది. గతంలో జరిగిన దిశ సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. 

జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటే..

ఏదైనా సంఘటనపై బాధితులు ఏ పోలీస్‌స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయొచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ పేరుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఆ తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేస్తారు. మొదట ఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందిందో అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు నంబర్‌ కేటాయించకుండా రికార్డులో మాత్రం జీరోగా చూపిస్తారు. దీన్నే జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటారు. కేసు బదిలీ అయిన పోలీస్‌స్టేషన్‌ రికార్డులలో ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ను కేటాయిస్తారు. బాధితులకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిధిల పేరుతో జాప్యం జరుగకూడదని జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఏ పోలీస్‌స్టేషన్‌కైనా వెళ్లొచ్చు

ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధితులు దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. నేరుగా బాధితుడు వెళ్లగానే సమస్య తెలుసుకొని జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం జరుగుతుంది. ఏదైనా అనుమానంగా సంచరిస్తున్న, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాలి.

- సూర్యానాయక్‌, పట్టణ సీఐ, వనపర్తి