సోమవారం 30 నవంబర్ 2020
Wanaparthy - Jun 07, 2020 , 02:56:43

సీజనల్‌ వ్యాధుల నివారణకు పరిశుభ్రత కార్యక్రమం

సీజనల్‌ వ్యాధుల నివారణకు పరిశుభ్రత కార్యక్రమం

ప్రతి ఆదివారం 10గంటల నుంచి 10 నిమిషాలు

మున్సిపాలిటీ పరిధిలో అవగాహన, నీటి పారబోత

వనపర్తి: ప్రస్తుతం ప్రజలు కరోనా వైరస్‌తో కొట్టుమిట్డాడుతున్న సందర్భం. దీనికితోడు రానున్న వానకాలంలో ఎదురయ్యే సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా ముందస్తుగా ‘ప్రతి ఆదివారం 10 గంటలకు.. 10 నిమిషాలు’ అనే కార్యక్రమాన్ని మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు అన్ని మున్సిపాలిటీల పరిధిలో ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 10నిమిషాలపాటు పరిశుభ్రత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీజనల్‌ వ్యాధుల (దోమల వల్ల వచ్చే వ్యాధులు) బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రోగాల నుంచి రక్షణ పొందడానికి వీలవుతుందని మంత్రి సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయడం ప్రధాన అంశం. చాలా రోజులుగా నిల్వ నీరు ఉండటం వల్ల ఎన్నో ప్రమాదరకమైన సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రతి ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డులో నిల్వ ఉన్న నీటిని పారబోస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిథులు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌ సమీక్షతో..

మే నెలలో హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపాలిటీ కమిషనర్లతో మున్సిపల్‌ శాఖ మంత్రి ప్రతి ఆదివారం 10గంటల నుంచి 10నిమిషాల పాటు శుభ్రత, నిల్వ నీటి పారబోత వంటి ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మార్గదర్శనంలో కార్యక్రమం కొనసాగుతుంది.

ప్రతి ఆదివారం చేసే కార్యక్రమాలు

  1. నీటి తొట్లు, డ్రమ్ములు, సంపులలో పాత నీరు నిల్వ లేకుండా పారబోయడం. 
  2. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించడం. 
  3. ఇంటి పరిసరాలలో నీటిని నిల్వ లేకుండా చూడటం. 
  4. పరిసర ప్రాంతాల్లో పిచ్చిమొక్కలు లేకుండా తొలగించడం. 
  5. దోమల ఉత్పత్తి జరుగకుండా ఇండ్లలో తులసి, పుదీనా, సిట్రోనెల్లాగ్రాస్‌ వంటి మొక్కలను పూల కుండీల్లో పెంచుకునేలా సలహాలు ఇవ్వడం.

జాగ్రత్తలు తీసుకోవాలి

మంత్రి కేటీఆర్‌, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశాల మేరకు రెండు వారాలుగా ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలపాటు వార్డుల్లో ఆయా ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సీజనల్‌ వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడకముందే ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తే వ్యాధుల ముప్పు తప్పుతుంది. ప్రతి వారం ఒక వార్డు చొప్పున ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. 

- మహేశ్వర్‌రెడ్డి, మున్సిపాలిటీ కమిషనర్‌, వనపర్తి