శనివారం 11 జూలై 2020
Wanaparthy - May 29, 2020 , 03:21:58

అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

జూన్‌ ఒకటో తేదీ నుంచి పారిశుధ్య  వారోత్సవాలు నిర్వహించాలి

 రైతువేదికల నిర్మాణంపై నిర్లక్ష్యం చేయవద్దు

 అధికారుల సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు

మహబూబ్‌నగర్‌ : అన్ని శాఖల అధికారులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్య వారోత్సవం నిర్వహించాలని సూచించారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. నియంత్రిత వ్యవసాయ విధానం, వానకాలం-2020కి సంబంధించి ఇదివరకే ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ప్రత్యేక అధికారులు వారి వారి మండలాల్లో తిరిగి డిమాండ్‌ ఉన్న పంటలను పండించాలని రైతులకు సూచించాలని తెలిపారు. వానకాలం ప్రణాళికలో భాగంగా వరి, కంది, పెసర్లు తదితర విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భవిష్యత్తులో విత్తనాలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా క్షమించేది లేదన్నారు. ప్రతి సీనియర్‌ అధికారికి ఐదు రైతు వేదికల నిర్మాణాల బాధ్యతను అప్పగించాలని తెలిపారు. రైతువేదికల నిర్మాణంపై నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని సూచించారు. అలాగే, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో 62లక్షల మొక్కలు నాటేందుకు అందరూ సిద్ధం కావాలన్నారు. 15 మండలాలకు సంబంధించి 150 బ్లాక్‌ ఫ్లాంటేషన్లు అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి శుక్రవారం హరితహారం మొక్కలకు తప్పనిసరిగా నీరు అందించాలని తెలిపారు. ప్రతి నర్సరీని తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని తెలిపారు. కొవిడ్‌-19కు సంబంధించి జిల్లాలో ఇంకా 4435 మంది హోం క్వారన్‌టైన్‌లో ఉన్నారని కలెక్టర్‌ చెప్పారు. వీరందరిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని, ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో కరోనా కేసులు నమోదు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జూన్‌ 8 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను పూర్తి పారదర్శకంగా నిబంధనల మేరకు భర్తీ చేయాలన్నారు.

బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం చేయండి 

రైతుల రుణాలకు సంబంధించిన అకౌంట్లకు ఆధార్‌ అనుసంధానం చేయాలని కలెక్టర్‌ వెంకట్రావు సూచించారు. వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. నూతన వ్యవసాయ విధానం మేరకు సూక్ష్మప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం కోసం వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఏఈవోలతో బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, మోహన్‌లాల్‌, డీఆర్వో స్వర్ణలత, జెడ్పీ సీఈవోయాదయ్య, ఆర్డీవో శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. 


logo