శనివారం 11 జూలై 2020
Wanaparthy - May 29, 2020 , 03:14:52

రైతును రాజు చేస్తాం

రైతును రాజు చేస్తాం

  పంటల మార్పుతోనే అన్నదాతకు లాభాలు

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

‘పాలమూరు’తో సస్యశ్యామలం చేస్తాం

 ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

 ప్రతి రైతుకూ  రైతుబంధు  పథకం వర్తింపజేస్తాం

రైతుబంధు సమితి  రాష్ట్ర అధ్యక్షుడు పల్లా

నారాయణపేట, వనపర్తిలో  నియంత్రిత వ్యవసాయ 

విధానంపై రైతు  అవగాహన సదస్సులు

 ‘రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు.. నూతన వ్యవసాయ విధానంతో  అన్నదాతను లక్షాధికారిని చేయడమే లక్ష్యం.. పాలమూరు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం.. ఇంటి దొంగల వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుంది.. పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్‌ డ్రామా కొనసాగుతుంది’.. అని మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం నారాయణపేట, వనపర్తి జిల్లా కేంద్రాల్లో జరిగిన నియంత్రిత వ్యవసాయ  విధానంపై రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్లు వనజ, లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్లు హరిచందన, యాస్మిన్‌బాషాతో కలిసి మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని అన్నారు. రానున్న వానకాలంలో అధికారుల సూచనలను రైతులు పాటించి పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

- నారాయణపేట/వనపర్తి, నమస్తే తెలంగాణ

వనపర్తి, నమస్తే తెలంగాణ :రైతును లక్షాధికారి చేయడమే లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయ విధానం అమలు జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతోనే సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గురువారం వనపర్తిలో నియంత్రిత వ్యవసాయ విధానంపై రైతు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రి సింగిరెడ్డితో పాటు రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర జనాభాకు తగ్గట్టుగా అవసరమైన పంటలను ఉత్పత్తి చేసే విధంగా సీఎం కేసీఆర్‌ నూతన విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రం నుంచి ఇతర రాష్ర్టాలకు, దేశాలకు ఉత్పత్తి చేసే విధంగా పంటల సాగును చేపడుతున్నామన్నారు. రైతుల కష్టాలు, నష్టాలు తెలిసిన సీఎం వారిని లక్షాధికారులను చేయాలన్న లక్ష్యంతోనే నూతన కార్యాచరణ తీసుకున్నారన్నారు. దేశ ప్రజల అవసరాల కోసం ఇతర దేశాల నుంచి నూనె ఉత్పత్తుల దిగుమతులకు కేంద్రం రూ.70 వేల కోట్లు చెల్లిస్తుందన్నారు. నూనె పంటల సాగును పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాటికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందన్నారు. 

పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్‌ డ్రామా : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్‌ పార్టీ గొప్ప డ్రామా ఆడుతుందని రాష్ట్ర ఎక్సైజ్‌,క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. రైతు అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడుతూ గతంలో వైఎస్‌ఆర్‌ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడ్‌కు జేజేలు పలికిన వారంతా నేడు మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మీ స్వార్థ రాజకీయాల వల్లే నాడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ఎడారిగా మారిందని మంత్రి విమర్శించారు. నాడు 12 లక్షలకు పైగా వలసలకు నిలయం చేసిన ప్రాంతంలో ఐదేళ్ల నుంచి మళ్లీ కొత్త వ్యవసాయం చిగురించిందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు అవసరమైన అన్ని ప్రాజెక్టుల పనులను పూర్తి చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్‌ నాయకులు పెండింగ్‌లో ఉంచిన వాటిని పూర్తి చేసుకున్నామని,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సహితం త్వరితగతిన పూర్తి చేసి 12 లక్షల ఎకరకాలకు సాగునీరు పారించుకుంటామన్నారు.

రైతులందరికీ రైతుబంధు: పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

వానాకాలంకు సంబంధించి రైతులందరికి రైతుబంధు పతకం అమలవుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి అద్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు.గతంలో 12 వేల కోట్ల రూపాయలు అవసరమైతే,ఇప్పుడు 14 వేల కోట్ల రూపాయలు రైతుబంధుకు అవసరమవుతున్నాయన్నారు.రైతుల కోసం సీఎం కేసీఆర్‌ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను అందిస్తున్నారన్నారు. స్వయంగా సేద్యం చేస్తున్న ముఖ్యమంత్రి రైతు కష్టంను తెలుసుకుని గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ నూతన వ్యవసాయ విధానంలో రైతులందరిని సమాయాత్తం చేసేలా రైతు సమన్వయ సమితి సభ్యులు కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఇంతలా పంటల దిగుబడులు ఎప్పుడు చూడలేదన్నారు. ప్రాజెక్టుల సాగునీటిని భరోసాగా అందివ్వడంతో రైతులు నమ్మకంగా పంటలు పండిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ రైతు రాజ్యం కాలన్నదే సీఎం ఆకాంక్ష అన్నారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ కరవు కాటకాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరులో పచ్చని పసిడి పంటలు పండించేలా సాగునీటి వనరులను సమకూర్చడం జరిగిందన్నారు. తనకు ఎమ్మెల్యే కంటే వ్యవసాయదారుడిగానే ఎక్కువ అనుభవం ఉందని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా రైతుకు అండగా నిలవలేదన్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానన్న సీఎం వాటి అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. సమావేశంలో కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా, డీసీసీబీ అధ్యక్షుడు నిజాం పాషా, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జగదీశ్వర్‌ రెడ్డి, జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు పెండెం కురుమూర్తి యాదవ్‌,మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌ రెడ్డి, డీసీవో కోదండరాములు, మార్కెటింగ్‌ ఏడీ సువర్ణసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.logo