శనివారం 11 జూలై 2020
Wanaparthy - May 29, 2020 , 03:14:48

ఎండకాలంలో పశువులు జాగ్రత్త

ఎండకాలంలో పశువులు జాగ్రత్త

వనపర్తి రూరల్‌ : రోజు రోజుకూ వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల వల్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. పశుపోషకులు, గొర్రెలు, మేకల పెంపకందారులు ఎండకాలంలో జాగ్రత్తలు పాటిస్తే అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. మారుతున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతిలో పెంచడం వల్ల వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

వడదెబ్బ లక్షణాలు

అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారుతాయి. పశువులు సరిగా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, ఆహారం 

తక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల ఇతర వ్యాధులు, పరాన్న జీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది. కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి కుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పోరుడు వంటి జీర్ణకోశ వ్యాధులు సంభవిస్తాయి. చూడి పశువులలో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. వడదెబ్బకు గురైన వాటిలో దాహం పెరుగుతుంది. తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కోసారి అపస్మారక స్థితికి వెళ్లి మరణించే అవకాశముంది.

మేతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవితాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. సులువుగా జీర్ణించుకునే పిండిపదార్థలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వాలి. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం, ఎండుగడ్డిని రాత్రి వేళల్లో విభజించి ఇవ్వాలి. అధిక పాలను ఇచ్చే పశువులకు నీటిలో దాణా కలిపి ఇవ్వాలి. మినరల్‌ మిక్చర్‌, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. మేత కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు పంపడం మంచిది.

పశువుల్లో పునరుత్పత్తి

ఎండకాలంలో పశువుల పునరుత్పత్తి ప్రకియ కుంటుబడుతుంది. అధిక వేడిమి వల్ల ఎఫ్‌ఎఫ్‌హెచ్‌ హార్మోన్‌ ఉతత్తితోపాటు శరీరంలో గ్లూకోజ్‌ శాతం తగ్గుతుంది. అందువల్ల అండాశయాల్లో స్తబ్ధత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి తిరిగి పొర్లుతుంటాయి. వేసవిలో ఎక్కువగా ఎండుగడ్డి తినడం వల్ల విటమిన్‌ ఏ కాల్షియం కాపర్‌, మెగ్నీషియం, ఖనిజ లవణాల లోపాలు  ఏర్పడి పశువుల్లో తాత్కాలిక వ్యంధత్వం ఏర్పడుతుంది. పశువుల ఎద లక్షణాలు వేసవి తాపం వల్ల  ప్రస్ఫుటంగా బహిర్గతం చేయలేవు. పశువులను జాగ్రత్తగా గమనిస్తూ టీఆర్‌బుల్‌ సహాయంతో ఎద గుర్తించి, వీర్య విధానం చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్య పరిరక్షణ

వేసవి తాపానికి గురైన పశువులలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకల్లో గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దాహంతో ఉన్న పశువులు మురుగు నీరు తాగటం వల్ల పారుడు వంటి జీర్ణ కోశ రోగం వచ్చే అవకాశం ఉంది. ఎల్లవేళలా శుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా తాగించాలి.

వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స

వడదెబ్బకు గురైన పశువులకు వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్లి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగడం, తల నుదుట మీద మంచుముక్కలు ఉంచడం లేదా చల్లని గోనె సంచిని కప్పాలి. వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. పశువైద్యుడి పర్యవేక్షణలో గ్లూకోజ్‌ స్లైన్‌, సోడియం క్లోరైడ్‌ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అవసరమైన చికిత్స చేయించాలి.

రైతులు జాగ్రత్తలు పాటించాలి

ఎండకాలంలో పశువులకు జాగ్రత్తలు తప్పనిసరి. చాలా పశువులు వడదెబ్బకు గురువుతాయి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో పశువులను గాలి వీచే ప్రదేశాల్లోకి మార్చాలి.  గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ అధికంగా ఉండటంతో పశు యజమానులు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పశువైద్య సేవలు వినియోగించుకోవాలి. 

- వెంకటేశ్వర్‌రెడ్డి, పశువైద్యాధికారి, వనపర్తి జిల్లా


logo