ఆదివారం 05 జూలై 2020
Wanaparthy - May 27, 2020 , 02:07:06

వంతెనవచ్చింది

వంతెనవచ్చింది

తీరిన దశాబ్దాల ‘దారి’ కష్టాలు

పూర్తయిన వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిల నిర్మాణం

అది 2009.. 2013. 

అప్పుడు కురిసిన భారీ వర్షాలకు ముత్తిరెడ్డిపల్లి వాగు పొంగిపొర్లింది. మూడు రోజులు పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ఆ గ్రామస్తుల గోస దేవుడికెరుకయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది వానకాలం వచ్చిందంటే చాలు ఆ గ్రామస్తులు బిక్కుబిక్కు మంటూ గడిపే పరిస్థితి. ఇది ఒక్క ముత్తిరెడ్డిపల్లి ప్రజల ఇబ్బందే కాదు..ఇలాంటి ‘వంతెన’ కష్టాలున్న గ్రామాలు నాలుగైదు ఉన్నాయి. స్వరాష్ట్రంలో వాగులపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంతో ఆ గ్రామాల ‘వంతెన’ కష్టాలు తీరాయి. ఎట్టకేలకు కొన్ని నిర్మాణాలు పూర్తి కావడంతో ఆయా గ్రామాల ప్రజల ఆనందానికి అవధుల్లేవు. - కోడేరు 

 

గతంలో వర్షాకాలం వచ్చిందంటే ఆయా గ్రామాల వాగులపై రైతులు, ప్రయాణికులు నానా ఇబ్బందులు పడేవారు. వానలు బాగా కురిస్తే వాగులు పొంగిపొర్లేవి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఒక్కోసారి రెండు మూడు రోజులు వరకు రవాణా సౌకర్యం పూర్తిగా స్తంభించిపోయేది. పరిస్థితుల్ని గమనించిన ప్రభుత్వం వాగులపై వంతెనల నిర్మాణాలకు అవసరమైన నిధులను కేటాయించింది. దీంతో పనులు చకచకా పూర్తి కావటంతో ఆయా గ్రామాల ప్రజలు ఎంతో సంబుర పడుతున్నారు. మండల పరిధిలోని ముత్తిరెడ్డిపల్లి- నాగులపల్లి గ్రామాల మధ్య వాగుపై రూ.2.40 కోట్ల అంచనాతో హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేశారు. అలాగే ఎత్తం మాలవాగుపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వ రూ.1.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా ఆ పనులు ఇంకా పూర్తి కాలేదు. అలాగే నర్సాయపల్లి నుంచి వయా కోడేరు మీదుగా నాగర్‌కర్నూల్‌, పెద్దకొత్తపల్లి నుంచి వయా పసుపుల మీదుగా నాగులపల్లి, తీగలపల్లి నుంచి వయా పెద్దకొత్తపల్లి మీదుగా యాపట్ల వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా వాగులపై వంతెనల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేశారు. ఇప్పటివరకు నాగులపల్లి-ముత్తిరెడ్డిపల్లి వాగుపై, జనుంపల్లి సమీపంలో ఉన్న వాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి చేశారు. జనుంపల్లి వద్ద డబుల్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా బ్రిడ్జి పనులు పూర్తి చేశారు. 

ఇబ్బందులు తొలిగినయ్‌

ప్రతి సంవత్సరం వానకాలంలో వాగుపై వర్షపు నీరు పొంగి పొర్లి ఎన్నో ఇబ్బందులు పడే వాళ్లం. భారీ వర్షాలు వస్తే వాగు పొంగి రెండు రోజుల వరకు బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మా కష్టాలకు చెక్‌ పడింది. ఈ సారి వర్షాలు వచ్చినా మాకు ఎలాంటి ఇబ్బందులు రావు. 

-అంజన్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌, ముత్తిరెడ్డిపల్లి

కల నెరవేరింది

ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న నాగులపల్లి గ్రామస్తుల కోరిక నెరవేరంది. ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని ఎన్నో సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించుకున్నాం. వానకాలంలో వాగు పొంగి పొర్లి నానా అవస్తలు పడ్డాం. 2009, 2013 యేడాదుల్లో కురిసిన భారీ వర్షాలకు ముత్తిరెడ్డిపల్లి వాగు పొంగి రెండు రోజుల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన నిర్మా ణం పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

 - రాములు,  మాజీ సర్పంచ్‌, నాగులపల్లిlogo