సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - May 27, 2020 , 02:00:37

ఎండ జర భద్రం!

ఎండ జర భద్రం!

నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు

40 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత

ప్రమాదకరంగా వడగాలులు

ఎండ తాకిడికి బెంబేలెత్తుతున్న జనం

చిట్కాలు పాటిస్తే ఉపశమనం

ఐదు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసటను తీసుకొచ్చింది. భానుడి భగభగతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తుండటంతో ప్రజలు ఉక్కపోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఎండ తాకిడి నుంచి ఏ విధంగా ఉపశమనం పొందాలని ప్రజలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చెట్టు నీడ చూసుకుందా మనుకుంటే నీళ్లు లేక  ఎండిపోయి.. నిల్వ నీడ లేకుండా పోయింది. పగలు ఎక్కువ, రాత్రి తక్కువ సమయం ఉండే వేసవిలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండుటెండల్లో సైతం చల్లదనాన్ని ఆస్వాదించొచ్చు.                - వెల్దండ

ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాలు

 •  ఆహార పదార్థాల్లో నూనె తక్కువగా వాడాలి.
 •  ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
 •  ఉదయం వేళలో నూనె వంటలు కాకుండా ఆవిరి వంటలు (కుడుములు, ఇడ్లీలు) తీసుకోవాలి.
 •  కర్భూజాలు ఎక్కువగా తీసుకోవాలి.
 •  మజ్జిగ అన్నం తింటే మరీ మంచిది.
 •  కూల్‌ డ్రింక్స్‌ కన్న కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది.
 •  కాఫీ, టీలకు వీలైనంత దూరంగా ఉండాలి.
 •  కిటికీలకు, గుమ్మాలకు తెరలను తడిపి కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రాకుండా చల్లదనాన్ని ఇస్తుంది.
 •  పిల్లలను ఎండలోకి వెళ్లనీయకుండా ఇండోర్‌ గేమ్స్‌ ఆడించాలి.
 •  పలుచని మజ్జిగలో కాస్త నిమ్మ, ఉప్పు వేసుకొని కలిపి పిల్లలు, పెద్దలు తాగితే మంచిది.
 •  బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా ఇంట్లో  అన్ని రకాల పండ్లతో, కూరగాయలతో జ్యూస్‌లు చేసుకుని తాగాలి.
 •  తాటి ముంజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 •  నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి.
 •  బయటకు వెళ్లినప్పుడు కండ్ల్లకు సన్‌ గ్లాస్‌, టోపీ వంటివి ధరించాలి.
 •  వివిధ ఆరోగ్య సమస్యలతో ఉంటే ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం కావొద్దు.
 •  శరీరానికి అతుక్కునే, బిగ్గరగా ఉన్న  దుస్తులు కాకుండా, వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించాలి.
 •  ఆల్కహాల్‌, సిగిరేట్‌కు దూరంగా ఉండాలి.
 •  బయటకు వెళ్లేటప్పుడు వాటర్‌ బాటిల్‌ వెంట తీసుకెళ్లాలి.