మంగళవారం 04 ఆగస్టు 2020
Wanaparthy - May 25, 2020 , 02:36:35

సేవే లక్ష్యంగా

సేవే లక్ష్యంగా

 ముప్పై ఏండ్లుగా సేవా కార్యక్రమాలు

 లాక్‌డౌన్‌లో 56 రోజులపాటు మరికల్‌ యువకుల సేవలు

 మూడుసార్లు ఉత్తమ యువక మండలి అవార్డు

మరికల్‌: యువత మేలుకో.. దేశాన్ని కాపాడుకో.. అంటూ యువతకు మార్గనిర్దేశం చేసిన స్వామి వివేకానందుడి సూక్తులను ఆదర్శంగా తీసుకున్నారు మరికల్‌ యువక మండలి సభ్యులు.. గ్రామాభివృద్ధికి గ్రామస్తులతో కలిసి శ్రమదానం, సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. కరోనా వ్యాప్తి నిర్మూళనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించించాయి. దీంతో పోలీసులతో సమానంగా ప్రజల సేవకు ముందుకొచ్చారు. నిత్యం 30 మంది యువకులు ఉదయం 6 నుంచి రాత్రి 9గంటల వరకు గ్రామంలో ప్రజలను బయటకు రాకుండా చూస్తూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. బాటసారుల ఆకలి తీరుస్తూ.. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నిరుపేదలను గుర్తించి వారికి తమవంతు సాయంగా నిత్యావసర సరుకులు అందించి అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. 

30 ఏండ్ల కిందట మండలి ఏర్పాటు..

మరికల్‌ యువకులు, ఉద్యోగులు, ప్రజాప్రతి నిధులు కలిసి గ్రామభివృద్ధే లక్ష్యంగా 1975లో యువక మండలిని ఏర్పాటు చేశారు. కొంతకాలం స్తబ్ధత ఏర్పడినా 1989 నవంబర్‌ నుంచి యువక మండలి పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సామా జిక సేవలు చేయడంతో మూడుసార్లు ఉత్తమ యు వక మండలి ఆవార్డు అందుకున్నారు. ప్రస్తుతం యువకులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతోపాటు విశ్రాంత ఉద్యోగులు సైతం యువకులకు సలహాలు ఇస్తూ అభివృద్ధికి చేయూతనిస్తున్నారు.

దాతల సహకారంతో..

యువక మండలి ఏర్పడి 30 ఏండ్లు గడుస్తున్నా.. పాలకుల నుంచి ఏ మాత్రం సహకారం అందడం లేదు. గ్రామంలోని వ్యాపారస్తులు, యువకులు కొంతమంది కలిసి రూ. 5లక్షలతో యువక మండలి భవనాన్ని నిర్మించారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి మండలికి కంప్యూటర్‌ను బహూకరించారు.

పార్టీలకతీతంగా..

యువకులమంతా కలిసి పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేస్త్తున్నాం. సామాజిక సేవా కార్యక్రమాలతోపాటు గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరింప చేయడంలో యువక మండలి ముందున్నది. విశ్రాంత ఉద్యోగులు ఇస్తున్న సలహాలతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. 

- రాజేశ్‌, యువక మండలి సభ్యుడు, మరికల్‌

భవన నిర్మాణానికి కృషి చేశా..

యువక మండలికి సొంత భవనం లేక పోవడంతో యువకులు, వ్యాపారులు, మిత్రల సహకారంతో రూ.5 లక్షలు విరాళాల ద్వారా సేకరించి నూతనంగా భవనాన్ని నిర్మించాము. భవన నిర్మాణానికి సహకరించిన వారిని ఎప్పటికీ మరిచిపోం. గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే యువక మండలి లక్ష్యం. 

- మల్లయ్య, యువక మండలి మాజీ అధ్యక్షుడు, మరికల్‌

చేయి చేయి కలిపి.. 

చేయి చేయి కలిపి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఐదేండ్ల కిందట యువక మండలిలో సభ్యుడిగా చేరాను. రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నాను. యువకులను చైతన్య పరుస్తూ యువక మండలికి సేవ చేస్తున్నాను. గ్రామస్తుల సహకారం మరువలేనిది. 

- శ్రీకాంత్‌రెడ్డి, యువక మండలి ప్రధాన కార్యదర్శి, మరికల్‌

ప్రతి రోజూ 30మంది..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా  ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ 30 మంది యువకులం ఉద యం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా పనిచేశాం. పోలీసులకు సహకరించి రోడ్లపైకి వాహనదారులు, ప్రజలు రాకుండా అవగాహన కల్పిస్తున్నాం. గ్రామస్తులు పోలీసుల కు, యువకులకు సహకరిస్తున్నారు.

- ఆంజనేయులు, యువక మండలి అధ్యక్షుడు, మరికల్‌

ప్రజలను చైతన్యం చేశారు

గ్రామంలో యువక మండలి సభ్యులు పోలీసులతో సమానంగా పనిచేస్తూ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా వైరస్‌పై జాగ్రత్తగా ఉండాలని చైతన్యం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు పనిచేస్త్తుండటంతో ప్రజలు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

- కస్సె గోవర్దన్‌, సర్పంచ్‌, మరికల్‌


logo