శుక్రవారం 05 జూన్ 2020
Wanaparthy - May 24, 2020 , 02:34:13

పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా

పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా

 దేశం సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రార్థించాలి

 వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

పెబ్బేరులో ముస్లింలకు నిత్యావసర సరుకులు పంపిణీ

 కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు

పెబ్బేరు : పేద ముస్లింలకు రంజాన్‌ తోఫా కింద నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కరోనా నుంచి దేశాన్ని కాపాడి సుభిక్షంగా ఉండాలని రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు అల్లాను ప్రార్థించాలని ఆయన సూచించారు. శనివారం పెబ్బేరులో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గౌని బుచ్చారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ గౌని కోదండరాంరెడ్డి సౌజన్యంతో అందించిన నిత్యావసర సరుకులను నిరుపేద ముస్లింలకు అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు ఇండ్లల్లోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయన్నారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషమైన కృషి చేస్తుందని తెలిపారు. విపత్కర పరిస్థితులు వచ్చినా పేదలను ఆదుకోనేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు. పేదల కడుపునింపేందుకు సర్కారు ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యంతోపాటు రూ.15 వందల నగదు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇండ్లల్లోనే ఉంటూ కరోనాను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు శేఖర్‌గౌడ్‌ తండ్రి నాగన్నగౌడ్‌, అలాగే గోవర్దన్‌రెడ్డి మాతృమూర్తి వెంకటమ్మలు అనారోగ్యంతో మృతి చెందగా ఇరు కుటుంబ సభ్యులను మంత్రి నిరంజన్‌రెడ్డి పరమర్శించారు. 

టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు  

 కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ యువ నాయకులు అక్రమ్‌, ఖాదర్‌, అజహర్‌ సలీమ్‌, వాజీద్‌ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, జెడ్పీటీసీ పద్మ, ఎంపీపీ శైలజ, టీఆర్‌ఎస్‌ నాయకులు రాములు యాదవ్‌, హరిశంకర్‌ నాయుడు, ఎల్లయ్య, రంగారెడ్డి, ముస్తాక్‌, పెద్దంటి వెంకటేశ్‌, ఈశ్వర్‌, సాయినాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo