మంగళవారం 26 మే 2020
Wanaparthy - May 14, 2020 , 02:15:43

సడలింపులూ...నిబంధనలు..!

సడలింపులూ...నిబంధనలు..!

మహబూబ్‌నగర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారించుకుంటూనే అభివృద్ధి పనుల్లోనూ ప్రజలకు ఇతర సేవలు అందించడంలోనూ అధికారులు మరింత నిమగ్నమై ముందు కు సాగుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పక్కాగా కొనసాగింది. నిబంధనలు పాటించని వారిపై అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తున్నారు. 

ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు

నారాయణపేట, నమస్తే తెలంగాణ : ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతిఒక్కరి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తర్వాతనే జిల్లాలోకి రావడానికి అనుమతి ఇచ్చేవిధంగా అధికారులు చర్యలు చేపట్టారు. దేశంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్ర నుంచి వలస వెళ్లిన జనం నారాయణపేట జిల్లాకు వస్తుండటంతో అధికారులు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ హరిచందన ఎక్లాస్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి సూచనలు ఇచ్చారు. బుధవారం 319 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు.

తెరుచుకున్న దుకాణాలు

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత తొలిసారి గద్వాల పట్టణంలో వ్యాపార దుకాణాలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర సరుకుల దుకాణాలు, కూరగాయల మార్కెట్‌లకు మాత్రమే అనుమతులిచ్చిన అధికారులు బుధవారం నుంచి అన్ని వ్యాపార సముదాయాలకు అనుమతులు ఇచ్చారు. సరి, బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అవకాశం కల్పించారు. అన్ని దుకాణాల వద్ద భౌతికదూరం పాటించకున్నా, మాస్కులు ధరించకున్నా జరిమానా విధిస్తామని మున్సిపల్‌ అధికారులు హెచ్చరించారు. వ్యాపార సముదాయాలు తెరుచుకోవడంతో రోడ్లపై సందడి వాతావరణం నెలకొన్నది. 

వలస కూలీల వివరాలు నమోదు

వనపర్తి, నమస్తే తెలంగాణ: వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వస్తున్న వలస కూలీల వివరాలు నమోదు చేసి, వైద్య పరీక్షలు చేస్తున్నారు. బుధవారం జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో కొత్తగా వచ్చిన కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే జిల్లాకు 1,480 మంది వరకు వివిధ రాష్ర్టాల నుంచి వలస కూలీలు వచ్చారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచారు. 

పల్లెలు, పట్టణాల్లో సందడి

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ మినహాయింపులతో జిల్లాలోని పల్లెలు, పట్టణాలు సందడిగా మారాయి. జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ అధికారులు రోడ్లపై విచ్చలవిడిగా వెలసిన దుకాణాలను తొలగింపజేశారు. ఫుట్‌పాత్‌ దుకాణాదారులు అందరూ తెరుచుకొని ప్రజలు గుంపులు గుంపులుగా ఉండేందుకు కారకులు అవుతుండడంతో వారి దుకాణాలను మూసివేయించారు. శుభకార్యాలు ఉండటంతో వస్త్ర, కిరాణ తదితర దుకాణాల వల్ల రద్దీ కనిపించింది. వందశాతం సిబ్బంది విధిగా మాస్కులు ధరించి విధులకు హాజరు కావాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఉండడంతో ప్రతి కార్యాలయం సందడిగా మారింది. అభివృద్ధి, పథకాల అమలుపై అధికారులు దృష్టి సారించారు. 


logo