శనివారం 30 మే 2020
Wanaparthy - Apr 24, 2020 , 01:49:48

అన్నదాతకు అండగా..

అన్నదాతకు అండగా..

  • సొంతూరిలోనే ధాన్యం కొనుగోళ్లు 
  • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కేంద్రాలు
  • 737 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • 83,832 మెట్రిక్‌ టన్నుల విక్రయాలు

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పైన ఉన్న ఉదాహరణ ఒక్క నారాయణది మాత్రమే కాదు.. ఉమ్మడి జిల్లాలోని ప్రతి రైతుదీ.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులను కూడా కేటాయించింది. దీంతో ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 255 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 737 కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మేరకు క్వింటాలుకు రూ.1835 మద్దతు ధర అందించి 83,832 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇంకా విక్రయాలు కొనసాగుతున్నాయి. రైతుల ముంగిటే కొనుగోళ్లు చేస్తున్నందున వారికి రవాణా ఖర్చులు తగ్గిపోయాయి. ధర విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేదు. 

ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు.. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 225 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. రైతులకు ఇబ్బందుల్లేకుండా స్థానికంగానే కొంటున్నాం. రెండు గ్రామాలకు ఓ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశాం. ఎక్కువ ధాన్యం పండిన చోట గ్రామానికో కేంద్రం ఉన్నది. కొనుగోళ్లు చేసిన 15 రోజుల్లోగా ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు జిల్లాలో 300 మంది రైతుల నుంచి రూ.36.88 కోట్లు విలువ చేసే 20,100 టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. వారికి దశలవారీగా చెల్లింపులు చేస్తున్నాం. 

- వనజాత, డీఎస్‌వో, మహబూబ్‌నగర్‌ 

కష్టకాలంలో ఆదుకున్న సర్కారు..

బోరు కింద ఉన్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు జేసిన. 62 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కరో నా వచ్చినందుకు ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. ఈ కాలంలో సర్కార్‌ రైతుల కోసం మా ఊర్లనే ధాన్యం కొనేందుకు కేంద్రం ఏర్పాటు జేసింది. ఇక్కడనే వడ్లు అమ్మిన. సర్కార్‌ చెప్పినట్లు గిట్టుబాటు ధర రూ. 1835 వచ్చింది. తొందర్లనే నా ఖాతాలో డబ్బులు పడ్తాయన్నరు. రవాణా పైసలు మిగిలినయ్‌.. ఎటుపోయి అమ్మాలనే బాధ తప్పింది. మాకు కష్టం రాకుండా ఆదుకున్నందుకు సర్కార్‌కు కృతజ్ఞతలు. 

- మల్లేశ్‌, రైతు, అన్నాసాగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా


ఈయన పేరు నారాయణ. భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌కు చెందిన రైతు. బోరు కింద ఉన్న రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేశాడు. అకాల వర్షాలు, వడగండ్లతో నష్టం జరిగినా 58 క్వింటాళ్ల పంట చేతికొచ్చింది. కాగా, కరోనా విజృంభిస్తున్న తరుణంలో ధాన్యం ఎక్కడ అమ్మాలో అర్థం కాలేదు. మిల్లర్లకు అమ్మితే క్వింటాల్‌కు కనీసం రూ.1600 కూడా వస్తాయో లేదోనని ఆందోళన చెందాడు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి స్థానికంగానే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తన సొంత గ్రామంలోనే ఏర్పాటు చేసిన కేంద్రంలో క్వింటాల్‌ను మద్దతు ధర రూ.1835కు విక్రయించాడు. మిల్లర్లకు అమ్మితే ఏంటి.. అనే పరిస్థితి నుంచి ఇంటి వద్దే రవాణా కోసం పైసా ఖర్చు లేకుండా గిట్టుబాటు ధర రావడంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.


logo