మంగళవారం 26 మే 2020
Wanaparthy - Apr 13, 2020 , 03:03:09

టెలి మెడిసిన్‌తో ఇంటి వద్దకే వైద్యం

టెలి మెడిసిన్‌తో ఇంటి వద్దకే వైద్యం

  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి సత్వర చికిత్స అందించేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తగా టెలి మెడిసిన్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెలి మెడిసిన్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు ఏదైనా జబ్బుతో బాధపడుతున్నట్లయితే టెలి మెడిసిన్‌ కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన ఫోన్‌ నెంబర్‌ 08542-226670కు ఫోన్‌ చేసి సమస్యను తెలియజేస్తే తక్షణమే వారికి వైద్య సలహాలతోపాటు చికిత్స లభిస్తుందన్నారు. టెలి మెడిసిన్‌ విధానం ద్వారా రోగులకు వైద్య సేవలు అందించేందుకుగాను జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన 26 మంది డాక్టర్లు, 43మంది ప్రైవేటు డాక్టర్లు, 210 మంది ఏఎన్‌ఎంలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి తెలిపారు. అలాగే, అత్యవసర పరిస్థితులలో రోగులను దవాఖానకు తరలించేందుకు రెండు అంబులెన్సులను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. టెలి మెడిసిన్‌ కంట్రోల్‌ రూం 24 గంటలు పనిచేసేలా ఏర్పాటు చేశామన్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ టెలి మెడిసిన్‌కు సహకారం అందించేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. కరోనా ముగిసిన తర్వాత కూడా టెలి మెడిసిన్‌ను కొనసాగిస్తామని తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందుల పడుతున్న వారికి టెలి మెడిసిన్‌ చాలా చక్కగా ఉపయోగపడుతుందన్నారు. కాగా, జిల్లా దవాఖాన మాజీ సూపరింటెండెంట్‌ శామ్యూల్‌ పోలీసుల సంక్షేమం కోసం రూ. లక్ష చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఐఎంఎ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌ పాల్గొన్నారు. 


logo