ఆదివారం 24 మే 2020
Wanaparthy - Mar 09, 2020 , 00:45:09

నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోలీ పర్వదినం

నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హోలీ పర్వదినం

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: పేద, ధనిక తారతమ్యాలు వదిలేసి.. మనసులోని బాధలన్నింటినీ రంగులతో కడిగేసే మధురక్షణాలు రానే వచ్చాయి. ప్రతిరోజూ ఎన్నో ఒత్తిళ్లు, కేరీర్‌ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఉరుకులు, పరుగులు.. ఇలా ఏడాదంతా టెన్షన్‌ టెన్షన్‌గా గడిచిపోయే జనాల జీవితంలో సప్తవర్ణాల శోభను అద్దేందుకు రంగుల కేళీ హోలీ.. వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆనందాల హోలీ.. విషాదాల కేళీ కాకుండా ఉండేందుకు సహజసిద్ధమైన రంగులను మాత్రమే వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సాంప్రదాయ రంగులతోనే హోలీ పండుగ చేసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ పురాణం

హోలీ పుట్టుక గురించి పురాణగాథలు అనేకం ఉన్నాయి. ‘హోలిక’ అనే రాక్షసి తాను నివసించే పరిసరాల్లోని పిల్లలను ఎత్తుకుపోయి తినేసేదట! దీంతో ఆ ప్రాంత ప్రజలంతా ఏకమై హోలికను పట్టుకొని కాల్చి చంపారట! అలా నాటి నుంచి హోలిక పేరిట ఏటా హోలీ పండుగ జరుపుకుంటారని ప్రతీతి.

సహజ రంగులతోనే ఆనందం

సాధారణంగా హోలీ ఆడిన తర్వాత చాలామందిని ఇబ్బంది పెట్టేది చర్మ సమస్యలు. ఇందుకు కారణం రంగుల్లో ఎక్కువ మోతాదులో రసాయన పదార్థాలు కలిసి ఉండడమే. ఈ తరహా రంగులు శరీరంపై ఎక్కువ సేపు ఉంటే చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ తరహా రంగులు పొరపాటున కళ్లలో పడితే చాలా ప్రమాదం కూడా. అందుకే హోలీ ఆడే సమయంలో ఎంచుకునే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు రసాయనాలు కలిసిన రంగులకు దూరంగా ఉండాలంటున్నారు. వీటికి బదులుగా సహజసిద్ధంగా తయారైన రంగులను హోలీ కోసం ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలామంది హోలీ వేడుకలకు  దూరంగా ఉండాలని భావించినప్పటికీ మన రాష్ర్టానికి కరోనా భయం లేదని సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో స్పష్టంచేయగా చాలా చోట్ల హోలీ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు సహజసిద్ధమైన, సాంప్రదాయమైన రంగులతోనే హోలీ వేడుకలు జరుపుకోవాలని సూచిస్తున్నారు. పసుపు రంగు నీళ్లు చల్లుకోవడం ఉత్తమైనదిగా శుభప్రదంగా పేర్కొంటున్నారు.  

ఈ సూచనలు పాటిస్తే మేలు

రసాయనాలు కలిపిన రంగులతో హోలీ ఆడితే వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోండి. 

ఎక్కువగా ఎరుపు, పింక్‌ రంగులనే వాడండి. ఇవి తక్కువ గాడత కలిగి ఉండడం వల్ల శరీరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. 

హోలీ ఆడటానికి ముందు ముఖానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనె రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది. 

ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బుకన్నా కైన్సింగ్‌ మిల్క్‌ ఉత్తమమైనది. 

కృత్రిమ రసాయనాలు కళ్లలో పడితే రెటీనా దెబ్బతిని కళ్లు ఎరుపెక్కడం, మంట మండటం కావొచ్చు.

కళ్లలో రంగులు పడితే నలుపడం, రుద్దడం మంచిది కాదు. చల్లని నీటితో శుభ్రం చేసి ప్రాథమిక చికిత్స తర్వాత అర్హత గల వైద్యుడిని సంప్రదించాలి

చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్‌ కలిపి రాస్తూ ఉంటారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఎలాంటి ఆయిల్స్‌ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అడ్డుకోవచ్చు. 


సలహాలు పాటించండి

హోలీ సందర్భంగా కోడిగుడ్లు, బురుద, మురికినీరు, పేడ ఇతరుల మీద చల్లకుండా వారించండి.

హోలీ జరుపుకోవడం ఇష్టం లేకుంటే హాయిగా ఇంట్లో గడిపేయండి. ఒకవేళ పిల్లలకు ఇష్టంగా ఉంటే వారిని ప్రోత్సహించండి. తగిన జాగ్రత్తలు చెప్పండి. సహజసిద్ధమైన రంగులు అందుబాటులో ఉంచండి. 

అల్లరి చిల్లరితో కూడిన పార్టీలకు పిల్లలను దూరంగా ఉంచండి. ఇవి ప్రశాంతంగా ఉండే కుటుంబ వాతావరణాన్ని గందరగోళం పరుస్తాయి. 


logo