గురువారం 02 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 08, 2020 , 01:43:27

కృష్ణాతీరం వెంట నిఘా

కృష్ణాతీరం వెంట నిఘా

కొల్లాపూర్‌ నమస్తే తెలంగాణ: శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో నిషేధిత అలివి వలలను  వినియోగిస్తు తెలంగాణ మత్య్ససంపదను ఆంధ్రా దళారులు కొల్లగొడితే చూస్తు ఊరుకోమని నాగర్‌కర్నూల్‌ జిల్లా మత్స్యశాఖ అధికారిణి రాధారోహిణి హెచ్చరించారు. వీటిని సమూలంగా నిర్మూలించడానికి పోలీసు, మత్స్య, రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ బృందాలు కృష్ణానది తీరం  వెంట నిరంతరం గాలింపు చేపట్టనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కొల్లాపూర్‌, పెంట్లవెల్లి మండలాలకు చెందిన మత్స్యకారులకు శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ సదస్సుకు నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మత్య్ససహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంపీపీలు గాదెల సుధారాణి, ఉమామహేశ్వరి, తాసిల్దార్‌ సుదర్శన్‌రెడ్డి, మల్లేశ్వరం సర్పంచ్‌ నాగరాజు, ఎస్సైలు మురళీగౌడ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. మత్స్యశాఖ అధికారిణి మాట్లాడుతూ మత్య్సకారులు జీవనోపాధికి ప్రభుత్వం 29 లక్షల చేపపిల్లలను శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో వదలడం జరిగిందన్నారు. అయితే ఆంధ్రాజాలర్లు నిషేధిత అలివి వలలను వినియోగిస్తూ మత్స్య సంపదను కొల్లగొడుతున్న విషయంపై  ప్రభుత్వం కఠినంగా ఉందని ఆమె పేర్కొన్నారు.  లైసెన్సు లేకుండా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో చేపల వేట చేయరాదని, లైసెన్సుదారుడైనా నిషేధిత అలివి వలలను ఉపయోగించొద్దని, ఒకవేళ ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మత్స్యకారుడు లైసెన్సు ద్వారా గుర్తింపు కార్డు జారీ చేస్తామని, దాడులకు వచ్చే టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు గుర్తింపు కార్డులు చూపాలని సూచించారు.  కొందరు స్థానిక మత్స్యకారులు ఆంధ్రా జాలర్లకు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో నోటీసు బోర్డులపై టాస్క్‌ఫోర్స్‌  బృందం అధికారుల ఫోన్‌ నంబర్లు ఉంచుతామన్నారు. 

మత్స్యకారుడి వద్ద లైసెన్సు ఉండాలి

శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో చేపలవేట కొనసాగించే ప్రతి మత్స్యకారుడి వద్ద లైసెన్స్‌ ఉండాలని, తనిఖీలకు వచ్చినప్పుడు చూపాలని నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దాడుల్లో అలివి వలలతో పట్టుబడితే రెవెన్యూ యాక్టు ప్రకారం రెవెన్యూ శాఖకు అప్పచెబుతామన్నారు. వారు ఆ కేసును తర్వాత పోలీసులకు అప్పగించే బాధ్యత తీసుకుంటారన్నారు. 

ఆంధ్రా జాలర్లకు సహకరిస్తే  చర్యలు

కృష్ణానదిలో నిషేధిత అలివి వలలతో చేపలు పట్టే ఆంధ్రా జాలర్లకు స్థానిక మత్స్యకారులు  సహకరించచొద్దని కొల్లాపూర్‌ తాసిల్దార్‌ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎవరైనా అలివి వలలతో నదిలో చేపలు పడుతున్నట్లు ఉంటే తమకు సమాచారం ఇస్తే అందుకు తాము చర్యలు తీసుకుంటామని అన్నారు.

మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మత్స్య సహకారసంఘం అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఆంధ్రా జాలర్లు నిషేధిత అలివి వలలతో చేపలు పడితే స్థానిక మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీంటుందన్నారు. స్థానిక మత్స్యకారులందరూ సమష్టి కృషితో అలివి వలల వినియోగాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. చేపల విక్రయానికి ద్విచక్రవాహనాలు, ఐస్‌బాక్సులు, పుట్టీలు సహకార సంఘాలకు వాహనాలు, మత్స్యసహకార సంఘం భవనాల నిర్మాణాలను చేపట్టిందన్నారు. తద్వారా మత్స్యకారులు తమ జీవనోపాధి వనరులతో ఆర్థికంగా ఎదుగుతూ తమ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ సమావేశానికి కొల్లాపూర్‌, పెంట్లవెల్లి మండలాలనుంచి మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


logo