శనివారం 04 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 08, 2020 , 01:41:10

ఆర్థిక గణన షురూ

ఆర్థిక గణన షురూ

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం శుక్రవారం నుం చి ఆర్థిక గణన చేపట్టేందుకు సిద్ధమైంది. గ్రామీణ, పట్టణ ప్రా ంతాల్లో ప్రజల జీవన శైలి, నివాసం, ఆర్థిక వనరులు, వ్యా పార సమూదాయాల వంటి వివరాలు సేకరించనున్నారు. దీ ని కోసం ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమించింది. వివరాల నమోదుకు ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటిని జియోట్యాగింగ్‌ చేసి ఎకనామిక్‌ సెన్సెస్‌ నంబరు కేటాయిస్తారు. జిల్లాలో 1,23,5 44 కుటుంబాలు ఉన్నాయి. అలాగే జిల్లా జనాభా 5,77,7 58 మంది ఉండగా, వీరిలో 2,94,833 మంది పురుషులు, 2,82,925 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లాలో 255 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో తొలి విడుతగా 48 గ్రామాలను ఎంపిక చేసుకుని సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాలో ఆర్థిక గణన ప్రారంభమైంది.

20 అంశాల వారీగా

ఆర్థిక గణనలో చేపట్టిన సర్వేలో దాదాపు 20 అంశాల వారీగా వివరాలను సేకరిస్తారు. కుటుంబ ఆదాయం ఎలా ఉంది. ఏ రూపాల్లో ఆదాయ వనరులు సమకూరుతున్నాయి. ప్రజలు ఎక్కువ దేనిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారనే అంశాలపై గణన చేపడుతున్నారు. ప్రజల జీవనాధారం, అదాయ మార్గాలు, ఏ వృత్తిలో ఎంతమంది జీవిస్తున్నారు. కుటుంబ సభ్యులు చేస్తున్న పనుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఇటీవల కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా 7వ ఆర్థిక గణన నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్యూమరేటర్లకు, సూపర్‌వైజర్లకు దిశా.. నిర్దేశం చేశారు. 

ఏడేళ్లకోసారి సర్వే

ప్రతి ఏడేళ్లకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సర్వే నిర్వహిస్తుంది. కేంద్ర ప్రణాళిక, గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈసర్వే చేపడతారు. 2013లో ఈ ఆర్థిక సర్వే నిర్వహించగా, మళ్లి ఇప్పుడు 2020లో 7వ ఆర్థిక సర్వేను నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మెరుగుపడిందనేది తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు ఆర్థిక సర్వేలను మ్యానువల్‌ విధానం(పేపర్‌పై నమోదు)లో నిర్వహించగా, ఈ సారి డిజిటల్‌ పద్ధతిలో వివరాలను సేకరించనున్నారు. గతంలో కుటుంబ సభ్యుల వారీగా సేకరించిన వివరాలను ప్రింటెడ్‌ పేపర్‌పైన నమోదు చేస్తే, ఇప్పుడు స్టార్ట్‌ ఫోన్లలో నమోదు చేయిస్తున్నారు. అయితే, ఈసర్వే ద్వారా ఎంత మంది వ్యవసాయం, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారనే వివరాలు నమోదవుతాయి. ఈ సమాచారం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయింపులు చేస్తుంది.

385 మంది ఎన్యూమరేటర్లతో..

జిల్లాలో చేపట్టిన ఆర్థిక సర్వేలో 385 మంది ఎన్యూమరేటర్లను ఎంపిక చేశారు. తొలి విడుతగా 48 గ్రామాలను గుర్తించారు. వీరితోపాటు మరో 48 మంది సూపర్‌వైజర్లను కూడా ఎంపిక చేసి సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే ఏవిధంగా నిర్వహించాలనే విషయమై వారికి జిల్లా స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్ల వారీగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను కేటాయించి ఆర్థిక గణనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 14 మండలాలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆర్థిక సర్వే కోసం ప్రత్యక్షంగా రూపొందించిన యాప్‌లో ఎన్యూమరేటర్లు వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరుస్తున్నారు. సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటిని వారు జియో ట్యాగింగ్‌ చేస్తారు. ప్రత్యేకంగా ఎకనామిక్‌ సెన్సెస్‌ (ఈసీ) నంబర్‌ను ఇంటి తలుపు లేదా గోడపైన నమోదు చేస్తారు. జిల్లాలో ఏప్రిల్‌ 30వ తేదీలోగా ఆర్థిక గణన పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకున్నారు.


logo