సోమవారం 06 ఏప్రిల్ 2020
Wanaparthy - Mar 05, 2020 , 23:29:09

పరిశుభ్రత బాధ్యత సర్పంచులదే

పరిశుభ్రత బాధ్యత సర్పంచులదే

గోపాల్‌పేట : గ్రామాల్లో పరిశుభ్రత బాధ్యత పూర్తిగా సర్పంచులదే అని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. గురువారం ఆమె మండల కేంద్రంలో హరితహారం నర్సరీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సర్పంచ్‌ శ్రీనివాస్‌తో మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల్లో శానిటేషన్‌తో పాటు హరితహారం నర్సరీలను కూడా చూసుకోవాలని అంతేకాకుండా నర్సరీకి సంబంధించి ఎన్ని మొక్కలు పెంచారు, ఎన్ని నాటారు, ఎంత విత్తనం వచ్చింది, తదితర వివరాలన్నీ తెలిసి ఉండాలన్నారు. నర్సరీ వద్ద బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ఎంపీడీవో శ్రీపాద్‌ను ప్రశ్నించారు. నర్సరీలోని మొక్కలకు తప్పని సరిగా నీడ ఏర్పాటు చేయాలని, ఒక్క మొక్క చనిపోయినా వనసేవకుడు బాధ్యత వహించాలన్నారు. మొక్కలకు ఉదయం సాయంత్రం రెండు సార్లు నీళ్లు పట్టించాలని సూచించారు. 


సర్పంచ్‌ ప్రతి రోజు హరితహారం నర్సరీని సందర్శించాలని చెప్పారు. గ్రామంలో ఇప్పటి వరకు డంపింగ్‌ యార్డుకు స్థలం సేకరించలేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్థలాన్ని గుర్తించి గ్రామ పంచాయతీకి అప్పగించాలని తాసిల్దార్‌ నరేందర్‌ను ఆదేశించారు. బండకాడి తండాలో తాగునీటి ట్యాంకు శుభ్రం చేయడం లేదని పురుగులు వస్తున్నాయని తండా మహిళ కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగ తక్షణమే ట్యాంకు శుభ్రం చేయించి దానిపై డేట్‌ కూడా రాయించాలని అన్నారు. పోలీస్‌ స్టేషన్‌ వెనుక పైపు గ్రామ శానిటేషన్‌ సిబ్బంది చెత్తను తగలబెడుతుండటాన్ని గమనించిన ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పక్కనే ఉన్న కిరాణం షాప్‌ నుంచి చెత్తను పక్కన పడవేస్తున్నారని తెలిసి షాపు నిర్వాహకుడికి రూ.500జరిమానా విధించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ చంద్రశేఖర్‌, ఏపీవో నరేందర్‌, ఎంపీవో హుస్సేనప్ప పాల్గొన్నారు.


వనపర్తిలో..

వనపర్తి, నమస్తే తెలంగాణ : హరితహారం కింద నాటిన అన్ని మొక్కలకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు నీరు పట్టాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా ఆదేశించారు. గురువారం ఆమె వనపర్తి నుంచి గోపాల్‌పేట వెళ్లే రహదారిలో సెయింట్‌ థామస్‌ పాఠశాల నుంచి నర్సింగాయపల్లి వరకు రహదారికి ఇరువైపులా హరితహారం కింద నాటుతున్న మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డితో మాట్లాడుతూ మొక్కలు ఎండిపోకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పట్టణంలోని రహదారులతో పాటు పట్టణానికి వెలుపల ఉన్న విలీన గ్రామాల వరకు అన్ని రహదారులపై పెద్ద మొక్కలను నాటి పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ తీసుకురావాలని కోరారు. logo